calender_icon.png 18 August, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

18-08-2025 01:40:36 AM

  1. పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ప్రకటించిన జేపీ నడ్డా
  2. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా విధులు 
  3. 16 ఏండ్ల ప్రాయంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక
  4. తమిళనాడుకు చెందిన సీనియర్ బీసీ నేత
  5. నామినేషన్లకు 21 చివరి తేదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు బీజేపీ అవకాశం కల్పించింది. ఆదివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్నుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్‌కు రాజకీయాల్లో 40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

తమిళనాడుకు చెందిన నేతను ఎంపిక చేయడంతో బీజేపీ దక్షిణాదిపై గట్టిగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. వచ్చే ఏడు తమిళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్లను ఈ నెల 21తో గడువు ముగియనుంది. 

40 ఏండ్ల అనుభవం.. 

తమిళనాడులో అక్టోబర్ 20, 1957న జన్మించిన సీపీ రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్ని కయ్యారు. తమిళనాడులో బీజేపీకి సీనియర్ నేతగా ఉన్న రాధాకృష్ణన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ఇండియా కాయర్ బోర్డు చైర్మన్‌గా విధులు నిర్వర్తించిన రాధాకృష్ణన్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 

16 ఏండ్ల ప్రాయంలోనే.. 

సీపీ రాధాకృష్ణన్16 సంవత్సరాల ప్రా యంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సీపీ రాధాకృష్ణన్ అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. 1998 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థిపై 1,50,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 1999 లో కూ డా ఎన్నికలు జరగ్గా.. ఆ దఫా 55, 000 పై చిలుకు మెజార్టీతో విజయబావుటా ఎగరేసి.. లోక్‌సభలో అడుగుపెట్టారు.

బీజేపీకి ఓటు వేయమని కోయంబత్తూరు ఓటర్లను ఒప్పించాల్సిన అవసరం లేదని 1999 లో రాధాకృష్ణన్ ప్రకటించారు. తొలిసారి డీ ఎంకే అభ్యర్థిపై, రెండో దఫా సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించిన రాధాకృష్ణన్... 2004, 2014, 2019 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేసినా గెలుపురుచి మాత్రం చూడలేదు. 2023లో బీజేపీ అధిష్ఠానం రాధాకృష్ణన్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది.

2024లో తెలంగాణ గవర్నర్‌గా తమిళసై రాజీనామా చేయ డంతో రాధాకృష్ణన్ కొద్ది రోజులుగా పాటు అదనపు బాధ్యతలు చేపట్టారు. అలాగే పుదు చ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. 2024 సంవత్సరం జూలై లో ఎన్డీ యే ప్రభుత్వం ఆయన్ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 

హర్షం వ్యక్తం చేసిన టీ బీజేపీ చీఫ్ 

ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాధాకృష్ణన్... ఉపరాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ తెలంగాణ శాఖ తర ఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 

దక్షిణాదిపై గురి పెట్టిన కమలనాథులు

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తమిళ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికే ఆ దిశగా పావులు కదుపుతోంది. తమిళనాడు స్థానిక పార్టీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని అధికార డీఎంకేను గద్దెదించేందుకు ప్రణాళిక రచించింది. సినీ నటుడు విజయ్ పార్టీని కూడా కలుపుకుని పోయే యోచనలో ఉన్నది. 

అంతే కాకుండా తమిళ సంస్కృతికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈసారి ఎలాగైనా తమిళపీఠంపై కాషాయ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడుకు చెందిన బీసీ నేత రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నియమించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.