calender_icon.png 18 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు!

18-08-2025 01:32:21 AM

  1. ప్రాజెక్ట్ పేరుతో సీఎం కుటుంబ సభ్యులు, స్నేహితుల రియల్ దందా
  2. భూములిచ్చిన రైతులకు ఇప్పటికైనా స్పష్టతివ్వాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన కలల ప్రాజెక్ట్ అని చెప్తున్న ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, సీఎం కేవలం కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోస మే ఆ ప్రకటన చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ఫ్యూచర్ సిటీతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కోట్ల రూపాయాల ప్రజాధనం వృథా అవుతుందని దుయ్యబట్టారు. సీఎం పన్నాగాలతో ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు.

నిర్లక్ష్యం ఆవహించిన ఒక పాలకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందనడానికి ఫ్యూచర్ సిటీ మేటి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని, ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీ పబ్లిసిటీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 20,000 ఎకరాలతో ప్రతిపాదనలను తయారు చేసిందని, స్థానిక రైతులు రాష్ర్ట ప్రయోజనాల కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఆ భూములను అప్పగిస్తామని చెప్పిందని, కానీ.. ఆ పని జరగలేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆరోపించారు.

దీంతో భూములిచ్చిన రైతన్నలు మోసపోయినట్లయిందని వాపోయారు. బీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకున్న ఫార్మాసిటీ అందుబాటులోకి వస్తే, లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో రైతులు, యువత నష్టపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. భూముల వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ  రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.