18-08-2025 01:44:38 AM
డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించి ఐదు నెలలు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు దాటి, శంషా బాద్ విమానాశ్రయం సమీపంలో ఫ్యూచ ర్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజె క్ట్‌కు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికీ సిద్ధం చేయలేదు. ఏడాదిన్నర క్రితం ఈ ప్రకటన వచ్చినా, ప్రాజెక్టు కోసం డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఐదు నెలలు గడిచినా, పురోగతి కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయం గా చైర్మన్‌గా ఉన్న ఈ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా 56 గ్రామాల ప్రజలు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఫ్యూచర్ సిటీ లో ఎక్కడ పార్కులు వస్తాయి.. ఎక్కడ రోడ్లు వస్తాయి.. మెట్రో రైల్ లైన్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది.. అత్యవసరమైతే భూములిప్పుడు అమ్ముకోవాలా? వద్దా? వంటి అనేక సందేహాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు, గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రంగంలోకి దిగారు.
ఇక్కడ ఆ అభివృద్ధి జరుగు తుంది.. అక్కడ ఫలానా మాల్, ఫలానా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందంటూ అరచేతిలో వైకుంఠం చూపించి.. భూములపై పెట్టుబడులు పెట్టేవారికి గాలం వేస్తున్నారు. అలా మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండాలని నిపు ణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటికీ తెరపడాలంటే ప్రభుత్వం త్వరిగతగిన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేయడమే పరిష్కారమని సూచిస్తున్నారు.
ఏ ప్రాంతంలో... ఎటు వైపు..
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు అవతల శంషాబాద్ విమానాశ్రయం సమీపం నుంచి శ్రీశైలం జాతీయ రహదారి నాగార్జునసాగర్ రాష్ట్రీయ రహదారికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్రప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 765.28 చదరపు కిలోమీటర్ల మేర ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీడీఐఐసీ) ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో భారీగా ఆర్థిక, పారిశ్రామిక క్లస్టర్లు నెలకొల్పాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
దీనిలో భాగంగా మార్చి 12న ఫ్యూచ ర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని సైతం ఏర్పాటు చేసింది. అథారిటీకి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైస్ చైర్మన్‌గా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి, ప్రభుత్వ సీఎస్‌తో పాటు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, రంగారెడ్డి కలెక్టర్, డీటీసీసీ సభ్యులుగా, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి ఒక కమిషనర్/సీఈవో మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని కూడా ప్రకటించారు.
సీఎం సైతం ఫ్యూచర్ సిటీ తన కలల ప్రాజెక్టు అని ఇప్పటికీ అనేక వేదికలపై చెప్పుకొంటున్నారు. ఇదే సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఎడ్యుకేషన్ హబ్ వంటి 12 జోన్లు ఏర్పాటు చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఆ ప్రాంత అభివృద్ధిపై ఎలాంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం కాలేదు.
56 గ్రామాల్లో ఆందోళన..
ఫ్యూచర్ సిటీ పరిధిలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలు, ఆమనగల్ మండలం లోని రెండు గ్రామాలు, ఇబ్రాహీంపట్నం మండలంలోని ఎనిమిది గ్రామాలు, కడ్తాల్ మండలంలోని ఆరు గ్రామాలు, కందుకూరు మండలంలోని 18 గ్రామాలు, మహే శ్వరం మండలంలోని రెండు గ్రామాలు, మంచాల మండలంలోని మూడు గ్రామా లు, యాచారం మండలంలోని 17 గ్రామా లు.. ఇలా మొత్తంంగా 56 గ్రామాలున్నా యి.
ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ప్ర స్తుతం.. తమ భూముల సంగతి ఏంటి.. ఏ ప్రాంతంలో పార్కులు వస్తాయి.. ఏ ప్రాం తంలో పారిశ్రామిక కారిడార్లు వస్తాయి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, నివాస సముదాయాలు ఎక్కడుంటాయి.. మెట్రో రైల్ ఏ ప్రాంతం నుంచి ఎక్కడి వరకు వస్తుంది.. లింక్ రోడ్లు, ప్రముఖ సంస్థలు ఎక్కడెక్కడ వస్తాయి.. తమ భూములను అమ్ముకోవాలా.. వద్దా.. అమ్ముకుంటే లాభమా.. లేక నష్టమా.. లేదంటే అలాగే ఉంచుకుంటే లాభ మా.. రహదారి మార్గాలు ఎక్కడి నుంచి ఎటు వెళ్తాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తమ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మల్టీ మోడల్ కనెక్టీవిటీ, ఆధునిక అర్బన్ వసతులు, రేడియల్ రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఆర్థిక, పారిశ్రామిక క్లస్టర్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తే, ఈ గందరగోళం ఉండేది కాదు. ప్రభుత్వం అథారిటీని ఏర్పాటు చేసి ఐదు నెలలు దాటింది.
అయినప్పటికీ, ఫ్యూచర్ సిటీపై అతీ గతి లేదు. వాస్తవానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఎంత పకడ్బందీగా, ఉన్నతంగా, సాంకేతికంగా, అభివృద్ధికి మార్గదర్శకంగా రూపొందిస్తే, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఆ స్థాయిలో ఉంటుంది. ఈ సందిగ్ధత నుంచి ప్రజలు బయటపడి, ఫ్యూచర్ సిటీపై ప్రజలకు నమ్మకం కలిగించాలంటే, ప్రభుత్వం వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
సందట్లో సడేమియాలా రియల్ బ్రోకర్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రకటించిందో లేదో ఇక ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల హడావుడి మొదలైంది. ‘ఇదిగో పులి అంటే.. అదిగో తోక’ అన్న చందంగా వారు ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు. ఇదిగో అక్కడ పెద్ద సంస్థ వస్తుంది.. ఇదంతా ఖాళీ స్థలమే.. అంటూ బ్రోక్టర్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడి సంస్థలకు వత్తాసు పలుకుతూ, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.
దీనితో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు, సంస్థలు వస్తాయో తెలియక.. సంధిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజల భూముల భవిష్యత్తు రియల్‌ఎస్టేట్ బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లేలా పరిస్థితి తయారైంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు భూములపైనే ఆశలు పెట్టుకుని బతుకుతుంటారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని గ్రామస్తులు కూడా ఫ్యూచర్ సిటీలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. తమకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నిశ్చింతగా బతికే భవిష్యత్తును వెతుక్కుంటున్నారు.
కానీ.. దీనికైనా ఒక దిశానిర్దేశం రావాలంటే, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ బయటకు రావాల్సిందే. అప్పుడే ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోతాయి. రాష్ట్రప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. భూముల వ్యవహారాలపైనా ఒక స్పష్టత వస్తుంది. ఈ 56 గ్రామాల్లోని ప్రజలు ఎవరి భవిష్యత్తును వారు నిర్ణయించుకుంటారు.
అయితే, ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను వీలైనంత త్వరగా సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తేనే ఇది సాధ్యం. లేకపోతే ఈ గందరగళం కొనసాగుతూనే ఉంటుంది. భూముల వ్యవహారాల్లో సందిగ్ధత, రియల్‌ఎస్టేట్ బ్రోకర్ల మాయమాటలు రాజ్యమేలుతూనే ఉంటాయి.