గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం
జగిత్యాల, మే 24 (విజయక్రాంతి): గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర నియంత్రణ సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. దోపిడీ, దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ఉపయోగాలపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, వాహన తనిఖీలు నిరహించాలని అన్నారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు రవీందర్ కుమార్, రఘుచందర్, ఉమామహేశరరావు, రంగారెడ్డి, వ్యవసాయాధికారులు, డీసీఆర్‌బీ, సీసీఎస్ ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
-ఎస్పీ సన్ ప్రీత్ సింగ్






