జల్సాలకు బానిసై వృద్ధురాలి హత్య

28-04-2024 01:15:16 AM

బంగారు నగలతో ఉడాయింపు

నాదర్‌గుల్ కేసు ఛేదించిన పోలీసులు

రిమాండ్‌కు పాత నేరస్తుడి తరలింపు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27, (విజయక్రాంతి): జల్సాలకు బానిసై డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని హత్యచేసిన కేసులో పాత నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. శనివారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ డీ సునీతారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న ఆదిభట్ల పీఎస్ పరిధిలోని నాదర్‌గుల్‌లో అనుమానాస్పద స్థితిలో కళావతి అనే వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలు చిన్న కూతురు కోంపల్లిలో నివాసం ఉండే రజని వద్ద జీడిమెట్ల సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన రత్న అశోక్ రెడ్డి (32) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పలు లోన్ యాప్‌లలో డబ్బులు తీసుకుని, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నష్టపోయాడు. ఆర్థికంగా కుదేలవ్వడంతో బెట్టింగ్ కోసం సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. నాదర్‌గుల్ ఊరిబయట వ్యవసాయ క్షేత్రంలో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న రజని తల్లి కళావతి బంగారంపై అశోక్‌రెడ్డి కన్నుపడింది. రెండు నెలల క్రితం బంగారం దొంగిలిద్దామని అనుకున్నా.. కుదరకపోవడంతో ఈ నెల 17న మరోసారి యత్నించాడు. 

ఇంట్లో ఒంటరిగా ఉన్న కళావతిపై దాడిచేసి చేతిగాజులు గుంజుకునే ప్రయత్నం చేయగా, ఆమె తిరగబడింది. దీంతో అక్కడే ఉన్న దుప్పటిని కళావతి ముఖంపై వేసి ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం కళావతి చేతులకు ఉన్న ౬ బంగారు గాజులను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. 18వ తేదీన అమీర్‌పేట్‌లోని గోల్డ్ కంపెనీలో అమ్మివేయగా వచ్చిన రూ.3,96,000తో మళ్లీ క్రికెట్ బెట్టింగ్ పాల్పడి మొత్తం డబ్బులు పోగొట్టకున్నాడు. 18వ తేదీన కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ, డాగ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టి నిందితుడిని పట్టుకొన్నారు. అశోక్‌రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో చిన్నతనం నుంచి చెడు అలవాట్లతో నేరస్థుడిగా మారాడని డీసీపీ తెలిపారు. 2019 నుంచి ఇతడికి నేరచరిత్ర ఉన్నదని, ఇప్పటి వరకు పలు పోలీస్టేషన్లలో 20 దొంగతనం కేసులు నమోదైనట్టు వెల్లడించారు. గత సంవత్సరం అక్టోబర్‌లో మహబూబ్ నగర్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా బుద్ది మారకుండా మళ్లీ దొంగతనాలు చేయడంతో ఆదిభట్ల పోలీస్టేషన్ నమోదైన కేసులో పట్టుబడినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 296.16 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ.58వేలు, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనకు చాకచాక్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్సై కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు, కానిస్టేబుల్స్ బృందాన్ని డీసీపీ అభినందించారు.