దేవుడిపై ఒట్టేస్తూ బీజేపీపై విమర్శలా

25-04-2024 02:16:53 AM

l అభ్యర్థిని ప్రకటించుకోలేని అసమర్థులు నన్ను ఓడిస్తారా? 

l 57 ఏండ్లలో బాత్రూంలు కట్టని కాంగ్రెస్ మోదీని విమర్శిస్తుంది

l పదేండ్లు ప్రజలను హింసించిన కేసీఆర్ నీతి సూత్రాలు వల్లిస్తుండు

l బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్

l బండి సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు

చొప్పదండి, ఏప్రిల్ 24: దేశం, ధర్మం గురించి మాట్లాడితే కొందరు కాంగ్రెస్ నాయకులు నన్ను కించపరిచేలా దూషిస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు.. దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీని విమర్శించే హక్కు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. బుధవారం చొప్పదండిలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు మంద శ్రీరామ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బీనవేణి వెంకటేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు బండి సమక్షంలో బీజేపీలో చేరారు.

వారందరికీ పార్టీ కండువా కప్పిన బండి.. బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి గద్వాలకు వెళ్లి జోగులాంబ మీద ఒట్టేస్తరు, యాదాద్రికి పోయి లక్ష్మీనర్సింహస్వామి మీద ఒట్టేస్తరు,  వరంగల్‌కు వెళ్లి భద్రకాళి అమ్మవారిపై ఒట్టేసి హామీలిస్తూ ప్రసంగిస్తూ.. బీజేపీని మతరాజకీయాలు చేస్తుందని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. వారు మాట్లాడితే కరెక్టట.. నేను మాట్లాడితే తప్పట.. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. తాను వాళ్లలా దేవుడిమీద ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయలేదనీ, దేశం కోసం ధర్మం రక్షణకోసం పోరాడుతున్న అని  వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నేటికీ తేల్చుకోలేని నాయకులు నన్ను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. స్థానిక నాయకుడు పార్టీకీ, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్‌రావు చేత నామినేషన్ వేయిస్తే, దీనిపై ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ హైకమాండ్ గరంగా ఉన్నదని చెప్పారు.

కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కూడా ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తాడని ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేసి మోసపోయారని అన్నారు. నరేంద్రమోదీ ఏ హామీలు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చినా ప్రజావసరాలను గుర్తించి, అభివృద్ధికి బాటలు వేస్తున్నారని స్పష్టంచేశారు. ఆగష్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారట.. ఎన్నికలలోపే ఎందుకు చేయలేదని అడిగారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకున్నా .. రుణమాఫీ సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ వేసిందని విమర్శించారు. రూ.700 కోట్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేసేందుకే మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్.. రూ.30 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ సర్కార్ మోసాలను ఎండగట్టి ఫాంహౌజ్‌లో పడుకున్నోడిని ధర్నాచౌక్‌కు గుంజుకొచ్చాననే అక్కసుతో నన్ను ఒడించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మోదీ ఇండ్లకోసం నిధులిస్తే కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని దుయ్యబట్టారు. మోదీ బాత్రూంలు నిర్మిస్తే ఓట్లేస్తరా అన్న పొన్నం 57 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ బాత్రూములు కట్టించకుండా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్లమెంట్ ఇంచార్జి ప్రవీణ్‌రావు, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల ప్రభాకర్‌యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్, పట్టణాధ్యక్షుడు బత్తిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.