26 April, 2026 | 1:40 AM

ఆరు నెలల్లో 12,865 కోట్లు

03-12-2024 01:29 AM
  1. తెలంగాణకు భారీగా ఎఫ్‌డీఐలు
  2. ఏప్రిల్ -జూన్ మధ్య 9,023 కోట్లు
  3. జూలై-సెప్టెంబర్ మధ్య 3,842 కోట్లు  
  4. రెండో త్రైమాసికంలో తగ్గినా పెట్టుబడుల ఆకర్షణలో టాప్ 6లో రాష్ట్రం

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లో తెలంగాణ దూసుకెళ్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రూ.12,865 కోట్లు వచ్చాయి. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.9,023 కోట్లు వస్తే.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,842 కోట్లు వచ్చాయి.

దీంతో మొదటి త్రైమాసికంతో పోలిస్తే రూ.5,181 కోట్లు తగ్గాయి.  ఆ సమయంలో ఎఫ్‌డీఐలు తగ్గినా దేశంలో పె ట్టుబడులను ఆకర్షించడంలో మన రాష్ట్రం దేశంలో ఆరో స్థానంలో నిలవడం గమనా ర్హం. మొదటి స్థానంలో రూ.1.13 లక్షల కోట్లతో మహారాష్ట్ర టాప్‌లో ఉంది.

రూ.33,060 కోట్లతో గుజరాత్ రెండో స్థా నంలో, రూ.29,597 కోట్లతో కర్ణాటక మూ డోస్థానంలో, రూ.26,807 కోట్లతో ఢిల్లీ నా లుగో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తెలంగాణకు వచ్చిన ఎఫ్‌డీఐల మొత్తం రూ.73,725 కోట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. 

గతేడాది కంటే 3,186  కోట్లు ఎక్కువ

ఈ ఏడాది అర్ధ సంవత్సరం (హెచ్1)లో ఎఫ్‌డీఐలు రూ.12,865 కోట్లు వచ్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలోని హెచ్1లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ.9,679 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే గతేడాది కంటే రూ.3,186 కోట్లు ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో గుజరాత్‌కు రూ.8,508 కోట్లు వస్తే.. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.24,552 కోట్లు వచ్చాయి.

అంటే దాదాపు 288 శాతం పెరిగాయి. క్యూ1లో మహారాష్ట్రకు రూ.70,795 కోట్లు వస్తే.. క్యూ2లో రూ.42,441కోట్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటకలో క్యూ1లో రూ.19,059 కోట్లు వస్తే.. క్యూ2లో రూ.10,538 కోట్లు వచ్చాయి. రెండో త్రైమాసికంలో వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటకకు చెందినవే 82 శాతం ఉండటం గమనార్హం.

ఈ రంగాల పెట్టుబడులే ఎక్కువ 

హెచ్1లో ఎక్కువగా ఐటీ, విద్యుత్, సేవా రంగాలకు సంబంధించిన పెట్టుబుడులు అధికంగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో ఈ రంగాల వాటా 49 శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్, ఐటీ, సేవా రంగాల్లో పరిశ్రమలను ఆకర్షించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలోనే ఈ రంగాల్లో ఎక్కువ పెట్టబడులు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పాలసీని ప్రకటించింది. మిగిలిన పారిశ్రామిక పాలసీలను రూపొందిస్తోంది. మరోవైపు విద్యుత్ పాలసీని సైతం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పాలసీలను ప్రకటిస్తే ఐటీ, సేవా, విద్యుత్ రంగాల్లో ఎఫ్‌డీఐలు మరింత పెరిగే అవకాశం ఉంది.