16-08-2025 08:00:35 PM
విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ (విజయక్రాంతి): సకల కళ సాంస్కృతిక సంఘం, ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్ సంయుక్త నిర్వహణలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణుని వేషాధారణ గొల్లభామల వేషధారణపై ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోటీ ప్రదర్శనలు నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు ఒక విభాగం ఆరు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు రెండవ విభాగంగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) హాజరై పోటీలను తిలకించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు. మంచి వేషధారణ తో కృష్ణుని పాటకు నృత్యం చేసిన వారికి నరేందర్ రెడ్డి అయిదు వేల పదహార్లు బహుమతి అందజేశారు. పోటీలకు న్యాయ నిర్ణయితగా బ్లూ మెన్ మాస్టర్ రామకృష్ణ వ్యవహరించి 9 మంది విజేతలను ఎంపిక చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... చిన్నారులైన బాలబాలికలు కృష్ణుడు, గొల్లభామల వేషధారణలో ఎంతో ముచ్చటగా తయారై ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో ఆనందదాయకమన్నారు. సమాజంలో సంస్కృతి యొక్క విలువలు పెంచే బాధ్యతను తీసుకున్నది కళాకారులె అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాధాకృష్ణ బృందం, అనంతారం గ్రామం చెందిన శ్రీ రాధాకృష్ణ భజన మండలి ప్రదర్శనలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర భజన మండలి అధ్యక్షులు రామ్ రెడ్డి, సకల కళల సాంస్కృతిక సంఘం అధ్యక్షులు ప్రవీణ్ సల్వాజి, కళా రవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విష్ణు దాసు గోపాలరావు, ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఫౌండర్ బుర్ర నటరాజు, డ్యాన్స్ మాస్టర్ బ్లూ మెన్ రామకృష్ణ, తిప్పబత్తిని రవి, పంజాల శ్రీధర్ గౌడ్, సల్వాజి సంధ్య, పొన్నాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.