calender_icon.png 16 August, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలకు స్ఫూర్తి దాత సర్వాయి పాపన్న

16-08-2025 08:01:41 PM

అతిరధుల సమక్షంలో మానుకోటలో పాపన్న విగ్రహవిష్కరణ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణా పల్లెలను మొఘల్ పాలకుల దారుణాల నుండి రక్షించి ప్రజల కోసం పోరాడిన ధీరుడు, సామాజిక సమానత్వానికి మద్దతుగా నిలిచిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శనంగా నిలుస్తుందని పలువురు వక్తలు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ జిల్లా గౌడ సంఘం, వివిధ రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనగామ జిల్లా పరిధిలోని ఖిల్లాషాపూర్ గ్రామంలో జన్మించిన పాపన్న బాల్యంలోనే తనలోని ధైర్యాన్ని, నేతృత్వాన్ని ప్రదర్శిస్తూ మొఘల్ అధికారుల మీద తిరుగుబాటు ప్రారంభించాడని, సామాజిక వ్యవస్థలో దళితులకు, అణగారిన వర్గాలకు లభించని గౌరవం కోసం గళం ఎత్తిన అతను, కేవలం వీరుడు గానే కాక, ఒక ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచాడన్నారు. పాపన్న తన సైన్యంతో కలిసి వరంగల్ కోటను ఆక్రమించి, అక్కడి పాలనను చేపట్టి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని, ఆయన పాలనలో ప్రజలకు న్యాయం, భద్రత లభించిందని పేర్కొంటున్నారు. సమాజంలో అన్ని వర్గాల సమానత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ పాపన్న జీవితం, నేటి తరానికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున గౌడ కులస్తులు, గీతా కార్మికులు తమ వృత్తి ధర్మాన్ని చాటే విధంగా తాటి కమ్మలు చేబూని భారీ ర్యాలీ నిర్వహించారు.