11-09-2025 12:41:38 AM
30కి పెరిగిన మృతుల సంఖ్య
-ఖాట్మాండులో సైన్యం గస్తీ
-రాజ్యాంగాన్ని మార్చాలని పట్టుబడుతున్న జెన్ జడ్
-తాత్కాలిక ప్రభుత్వాధినేతగా సుశీల కర్కి!
-టిబెట్‌లో చిక్కుకుపోయిన మానస్ సరోవర్ యాత్రికులు
-తెరుచుకున్న ఖాట్మాండు విమానాశ్రయం
ఖాట్మాండు, సెప్టెంబర్ 10: జెన్‌జడ్ అల్లర్లతో అట్టుడికిన నేపాల్‌లో బుధవా రం కర్ఫ్యూ విధించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉం టుందని నేపాల్ ఆర్మీ ప్రకటించింది.
నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 30కి చేరుకుందని, నిరసనల్లో 1033 మంది క్షతగాత్రులయ్యారని.. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధ్యక్షుడితో సమావేశం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో జెన్‌జడ్ నిరసనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయడంతో పాటు పలు రకాల డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచారు.
నేపా ల్ తాత్కాలిక సారధిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి అభ్యర్థిత్వానికి జెన్‌జడ్ మద్దతు తెలుపుతోంది. రెండు రోజుల అనంతరం నేపాల్ రాజధాని ఖాఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి తెరుచుకుంది. అల్లర్ల నేపథ్యం లో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన అనేక మంది భారతీయులు టిబెట్‌లోనే చిక్కుకుపోయి అనేక అవస్థలు పడుతున్నారు. నేపా ల్‌లో కర్ఫ్యూ విధించడంతో బీహార్‌లోని భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఖాఠ్మాండులో భద్రతా బలగాలు గస్తీ నిర్వహించాయి. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేశాయి. నిరసనకారులు చర్చలకు రావాలని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కోరా రు. అన్ని వర్గాల వారు శాంతించాలని, దేశానికి మరింత హాని తలపెట్టకూడదని అభ్య ర్థించారు. యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ఇప్పటికే ప్రధాని, ఆయన మంత్రి వర్గం మొత్తం రాజీనామాలు సమర్పించింది.
జెన్‌జడ్ డిమాండ్స్ ఇవే..
-ప్రస్తుతం ఉన్న ప్రతినిధుల సభను వెంటనే రద్దు చేయాలి.
-రాజ్యాంగాన్ని సవరించాలి. లేదా కొత్తగా రచించాలి. ఆ రాజ్యాంగ రచనలో పౌరులు, యువత, నిపుణుల భాగస్వామ్యం ఉండాలి
-కొంత సమయం తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలు స్వతంత్రంగా, పూర్తి పక్షపాత ధోరణిలో ఉండాలి. ప్రత్యక్ష ప్రజా భాగస్వామ్యం ఆధారంగా జరిగేలా చూడాలి.
-మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలి.
-విద్య, ఆరోగ్యం, న్యాయం, భద్రత, క మ్యూనికేషన్లు మొదలైన ఐదు రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలి.
-నిరుద్యోగం పారదోలేందుకు, వలసలు నియంత్రించేందుకు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి.
-ఈ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించి.. వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు, ఆర్థిక సహాయం అందించాలి.
‘ఈ ఉద్యమం ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కాదు. మొత్తం ఒక జనరేషన్, దేశభవిష్యత్ కోసం. కొత్త రాజకీయ వ్యవస్థ ఆధారంగానే శాంతి నెలకొంటుంది. అధ్యక్షుడు, నేపాల్ సైన్యం మా ప్రతిపాదనలను సానుకూలంగా అమలు చేస్తుందని భావిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
తాత్కాలిక అధినేతగా సుశీల కర్కి!
నేపాల్ తాత్కాలిక అధినేతగా సుప్రీం కోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. నేపాల్ వ్యాప్తంగా జెన్‌జడ్ నిరసనకారులు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఐదు వేల మంది యువకులు ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఖాట్మాండు మేయర్ బలెన్ షా పేరును మొదట ఇందుకోసం ప్రతిపాదించారు.
ఎన్నిసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని నిరసనకారులు తెలిపారు. ‘ఆయన మా కాల్స్‌కు స్పందించడం లేదు. చాలా మంది సుశీల కర్కి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు.’ అని జెన్‌జడ్ ప్రతినిధి మీడియాతో తెలిపారు. ఇదే ప్రతిపాదనతో కర్కీని ఇది వరకే సంప్రదించగా.. తనకు మద్దతు తెలుపుతున్నట్టు కనీసం వేయి మంది సంతకాలు చేయాలని కర్కీ తెలపగా.. ప్రస్తుతం ఆ సంతకాల సంఖ్య 2,500 దాటినట్టు తెలుస్తోంది.
72 సంవత్సరాల వయసున్న సుశీల కర్కి నేపాల్ సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన ఒకే ఒక మహిళగా రికార్డులకెక్కారు. కర్కి ఉపాధ్యాయురాలిగా కూడా సేవలందించారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
చిక్కుకుపోయిన యాత్రికులు
ఈ నిరసనల వల్ల భారత్ నుంచి కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన అనేక మంది యాత్రికులు టిబెట్‌లో చిక్కుకుపోయారు. వారిని తిరిగి వెనక్కు తీసుకొచ్చేందు కు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. చాలా మంది యాత్రికులు టిబెట్‌లోని డర్చెన్ అనే గ్రామంలో చిక్కుకుపోయా రు. నేపాల్ రాజధాని ఖాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ) తిరిగి తెరుచుకుంది. నిరసనల నేపథ్యంలో ఈ విమానాశ్రయం రెండు రోజులుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించలేదు.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
-నేపాల్‌లోని తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
ఎవరైనా నేపాల్‌లో చిక్కుకుపోతే హెల్ప్‌లైన్‌లో సంప్రదిస్తే సహాయం అందిస్తారు. అయితే నేపాల్‌లోని తెలంగాణ పౌరులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేవీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వ సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ పౌరులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించాల్సి హెల్ప్‌లైన్ నెంబర్లు..
వందన రెసిడెంట్ కమిషన్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్ 98719 99044
రక్షిత్ నాయక్ లైజన్ ఆఫీసర్ 96437 23157
సీహెచ్ చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 99493 51270