11-09-2025 12:45:58 AM
-గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ 98 ఎకరాలు కావాలి
-కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
-మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మిస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను బదలాయించాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.
గాంధీ సరోవర్‌లో మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్‌లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. సమావేశంలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.