11-09-2025 12:10:51 AM
ఓటేయకుంటే పథకాలు ఆపుతామంటూ బెదిరిస్తున్నారు
హైడ్రా పేరుతో బిల్డర్ల నుంచి కోట్ల దోపిడీ
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమే
రేవంత్‌రెడ్డి బీజేపీ సీఎం.. మైనార్టీలు నిజం గ్రహించాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ జైత్ర యాత్ర మళ్లీ ప్రారంభం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ ప్రజలను కాంగ్రెస్ బెదిరిస్తోందని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికలో పంచి గెలవడానికి రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని రేవంత్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిప డ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రె స్‌లో చేరలేదన్న అక్కసుతో బీఆర్‌ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తే ఆయన ఆత్మ హత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా తన ఇల్లు కూలగొడుతుందన్న భయం తో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ప్రా ణాలు తీసుకుందని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని హెచ్చరించారు.
డబ్బున్న పెద్దల జోలికి హైడ్రా పోదన్న కేటీఆర్, దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. అధికారం ఉందన్న అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
మోదీ కనుసన్నల్లో సీఎం రేవంత్‌రెడ్డి..
ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శనంలో నడుస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని, ఈ సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ, మోదీ, సీబీఐ లాంటి అంశాల్లో కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ఓటేస్తే నరేంద్ర మోదీకి, బీజేపీకి వేసినట్టే అన్నారు.
గడిచిన పదేళ్లలో మైనార్టీలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని మోసం చేయడంతో పాటు షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని చెప్పారు.
ఇప్పటివరకు ఒక్క మైనార్టీ విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్ అందించలేదన్నారు. రూ.4000 కోట్ల మైనార్టీ బడ్జెట్ ఇస్తామని ఇవ్వలేదని, కానీ పదేళ్లలో మైనార్టీల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. 60 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ వాడుకుందని కేటీఆర్ మండిపడ్డారు.
గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలి..
ఎవరూ కోరుకోని ఉప ఎన్నిక ఇదని, గోపినాథ్ హఠాత్తుగా దూరమవుతారని ఊహించ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తన ఇబ్బందులను గోపినాథ్ ఎన్నడూ తమతో పంచుకోలే దన్నారు. రాజకీయ నాయకుల జీవితాలు బయటికి కనిపించేలా ఉండవన్న సంగతి గోపినాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ఆదుకొని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ పరిస్థితి మెరుగ్గా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్ మెజార్టీ కోసం కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకొని, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈనెల 14వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్లి, గోపినాథ్ చేసిన పనులు, సేవలను ఓటర్లకు గుర్తుచేయాలన్నారు. బీఆర్‌ఎస్ అభిమానులు, సానుభూతి పరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్‌నగర్ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పీ విష్ణువర్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ టికెట్ మాగంటి సునీతకే!
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పోటీ చేయించను న్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంతో ఈ అంశం పై స్పష్టత వచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని చెప్పడంతో మాగంటి సునీతకు టికెట్ ఇవ్వనున్నట్టు తేలింది.
మాగంటి సునీత మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ లాగే తనకూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరో వైపు బీజేపీని ఎదుర్కొవడంలో భాగంగానే మాగంటి సునీతను పోటీలో నిలిపి సానుభూతి పొందాలని బీఆర్‌ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
స్వేచ్ఛను అణచివేయడం ఆపాలి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ డీజీపీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌కు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు, సోషల్ మీడియా యోధులపై వేధింపులను తక్షణమే ఆపాలని కోరారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రజాస్వామ్యస్ఫూర్తితో ముందుకు నడవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.