calender_icon.png 11 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుఖీభవ!

11-09-2025 12:49:54 AM

అధికారులు ఆశీర్వదించారు.. 

ఇక అడ్డేముంది?

ఎంట్రీ కోసం రేడియల్ రోడ్డు కట్ బుల్కాపూర్ నాలా కబ్జా

పుప్పాలగూడలో ‘సుఖీ ఉబుంటు’ గ్రూప్ భారీ నిర్మాణం

హెచ్‌ఎండీఏ, హైడ్రా జోక్యం చేసుకోవాలని డిమాండ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ రియ ల్ ఎస్టేట్ హాట్ స్పాట్ అయిన పుప్పాలగూడలో, సుప్రసిద్ధ సుఖీ గ్రూప్ నిర్మి స్తున్న ప్రతిష్ఠాత్మక ‘సుఖీ ఉబుంటు’ ప్రాజె క్ట్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నగరానికి జీవనాడి అయిన చారిత్రక బుల్కాపూర్ నాలాను కబ్జా చేసి, వేలాది వాహనాలు ప్రయాణించే కీలకమైన రేడియల్ రోడ్డు ను కత్తిరించి సుఖీ గ్రూప్ అక్రమంగా ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల అండదండలతోనే ఈ భారీ అక్రమా లకు పాల్పడుతున్నారని స్థానికులు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఇప్పటి కైనా హెచ్‌ఎండీఏ, హైడ్రా ఉన్నతాధికారు లు స్పందించి, భవిష్యత్ నగరానికి ముప్పుగా మారనున్న ఈ ప్రాజెక్ట్‌పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకప్పుడు శంకరపల్లి నుంచి మూసీ నది వరకు ప్రవహిస్తూ, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించిన బుల్కాపూర్ నాలా ఆనవాళ్లు లేకుండా పోతోంది. సర్వే నంబర్లు 314, 416, 417, 428లలో విస్తరించి ఉన్న ఈ నాలాను పూర్తిగా మట్టితో పూడ్చివేసి, దానిపైనే సుఖీ గ్రూప్ 5.25 ఎకరాల్లో ‘సుఖీ ఉబుంటు’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోం దని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు 36- అంతస్తుల టవర్లతో, 855 విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, కాగితాల్లో మాత్రం 82% ఓపెన్ స్పేస్ చూపించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

‘నాలాను పూడ్చివేసి ఓపెన్ స్పేస్ అనడం దారుణం. వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా జలమయమవడం ఖాయం’ అని పుప్పాలగూడ రెసి డెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డాలర్ హిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నాలా ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా అధికారులు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలను ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించే పుప్పాలగూడ రేడియల్ రోడ్లు అత్యంత కీలకమైనవి.

నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన మార్గాన్ని, సుఖీ ఉబుంటు ప్రాజెక్ట్ కోసం ఏకంగా కత్తిరించి, ప్రైవేట్ ఎంట్రన్స్‌గా మార్చుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేడియల్ రోడ్లు అనేవి ఔటర్ రింగ్ రోడ్డు ను నగరంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన రహదారులు. వీటిపై వాహనాల రాకపోకలు వేగంగా ఉంటాయి కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా హెచ్‌ఎండీఏ ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తుంది.

హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం, రేడియల్ రోడ్లకు నేరుగా ఏ ప్రాజెక్టుకు ప్రవేశం ఉండకూడదు. సర్వీస్ రోడ్ల ద్వారా మాత్రమే ప్రాజెక్టులలోకి ప్రవేశించాలి. ఇది రేడియల్ రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించబడింది. సుఖీ ఉబుంటు ప్రాజె క్ట్ ఈ నిబంధనలను ఉల్లంఘించి హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన ఈ చర్య వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయని, భవిష్యత్తులో ఇది మరింత తీవ్రరూపం దాల్చుతుందని వారు వాపోతున్నారు.

‘ప్రభుత్వ ఆస్తి అయి న రోడ్డును ఓ ప్రైవేట్ సంస్థ తన స్వార్థం కోసం ఎలా కత్తిరిస్తుంది? దీనికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు?’ అని స్థానికులు నిలదీస్తున్నారు. పుప్పాలగూడలో గజం స్థలం లక్షలు పలుకుతున్న నేపథ్యంలో, కొందరు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రియల్టర్లతో కుమ్మక్కు అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నా యి. నాలాలకు 100 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలున్నా, కోట్ల రూపాయల కమీషన్ల కోసం వాటన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నాలా ఆక్రమణలపై హెచ్చరికలు జారీచేసినా, క్షేత్రస్థా యిలో పరిస్థితి మారలేదనడానికి సుఖీ ఉబుంటు ప్రాజెక్టే నిదర్శనమని వారు చెబుతున్నారు.

సెప్టెంబర్ 8న జరిగిన ప్రజా వాణిలో అత్యధికంగా నాలా ఆక్రమణలపైనే ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 70కి పైగా ప్రపంచస్థాయి సదుపాయాలు, ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ అం టూ ఆకర్షణీయమైన ప్రకటనలతో కోట్లకు ఫ్లాట్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంది. నాలా, రోడ్డు ఆక్రమణలపై ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు స్థానికులు సిద్ధమ వుతున్నారు.

ఒకవేళ ఆక్రమణలు నిజమని తేలితే, ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయే ప్రమా దం ఉంది. దీంతో 2026 నవంబర్‌లో ఫ్లాట్ స్వాధీనం అవుతుందని ఆశతో కోట్లు పెట్టుబడి పెట్టిన కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంద ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి, నాలాను, రోడ్డును పూర్వస్థితికి తీసుకురావాలని, బా ధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

విజయక్రాంతి ప్రతినిధిని అడ్డుకున్న సిబ్బంది..

విజయక్రాంతి దినపత్రికకు చెందిన ఒక ప్రతినిధి, సుఖీ ఉబుంటు ప్రాజెక్టుకు సంబంధించి వివరణ కోరేందుకు వెళ్లగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఒక పత్రికా ప్రతినిధిగా, ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు వెళ్లినప్పుడు ఈ విధంగా ప్రవేశాన్ని నిరాకరించడం గమనార్హం. ఇది జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే చర్య అని స్థానికులు వ్యాఖ్యానించారు.

హెచ్‌ఎండీఏ అధికారుల స్పందన..

ఈ విషయంపై హెచ్‌ఎండీఏ అధికారులను వివరణ కోరగా, వారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. సుఖీ ఉబుంటు ప్రాజెక్టుకు రేడియల్ రోడ్డుపై ప్రవేశం ఇచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని వారు తెలిపారు. తాము ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిన తర్వాతే దీనిపై స్పందించగలమని చెప్పడం, వారి పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూ పుతోందని విమర్శలు వస్తున్నాయి. ఒక భారీ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అనుమతులపై సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అధికారుల హామీలు నీటిమూటలే..

హైడ్రా కమిషనర్ రెండుసార్లు ఇక్కడికి వచ్చి పర్యటించారు. ‘చూస్తాము, చేస్తాము’ అని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. ఈ నాలాను కబ్జా చేయకముందు మా ప్రాంతంలో 100 అడుగులకే బోర్లలో నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నాలాను చంపేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 500 అడుగులు వేసినా నీటి చుక్క దొరకడం లేదు. ఈ గోడు ఎవరికి చెప్పినా ఫలితం మాత్రం శూన్యం.      

లక్ష్మణ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మణికొండ