11-09-2025 12:53:25 AM
నేపాల్ యువతది ఆందోళన మాత్రమే కాదు, నెరవేరని వాగ్దానాలతో విసిగిపోయిన ఒక తరం ఆగ్రహానికి సంకేతం. భారతదేశాన్ని పీడిస్తున్న కుంభకోణాల మాదిరిగానే.. ప్రజాధనం ఉన్నతవర్గాల జేబుల్లోకి వెళ్లేందుకు సహకరించే పరిపాలనకు వ్యతిరేకంగా ఒక వ్యవస్థాగత తిరుగుబాటు. భారతదేశ అవినీతి సూచిక స్కోరు 40/100 వద్ద ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక చెబుతోంది. నేపాల్ అవినీతి సూచిక మరింత అధ్వాన్నంగా 35 వద్ద ఉంది.
మొదటి శ్రీలంక.. తరువాత బంగ్లాదేశ్.. ఇప్పుడు నేపాల్.. అవినీతిపై ప్రజలు సమరశంఖం పూరిస్తున్న రోజులివి. రాజకీయ నాయకుల పాలనాపరమైన అవినీతిని, బంధుప్రీతిని ఇక సహించబోమని ప్రజలు రాజప్రాసాదాలను ఎక్కి నినదిస్తున్న రోజులివి. నేపాల్ రాజధాని ఖాట్మాండు నడిబొడ్డున వేలాది మంది యువకులు వీధులకెక్కి పాలనను స్తంభింపజేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టారు. వారి ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నేపాల్ పరిణామాలు పొరుగు దేశమైన భారత్‌ను ఆశ్చర్యానికి గురిచేశాయి.
గాంధేయవాది జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో 1970లలో జరిగిన విప్లవం, 1975లో ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితిని నేపాల్ ఘటన ప్రతిబింబిస్తున్నది. నేపాల్‌లో యువత నేతృత్వంలోని ఈ ఉద్యమం ఒక హెచ్చరికగా పనిచేస్తున్నది. ఇది నేపాల్‌లోని రాజకీయ నాయకులు, అధికారులకు మాత్రమే కాదు.. సమాజంలోని అణువణువుకూ అవినీతి వ్యాపించి ఉన్న భారతదేశ నాయకత్వానికి కూడా ఒక భయంకరమైన హెచ్చరిక. నారాయణ్ ఉద్యమం ఇందిరాగాంధీ నిరంకుశ ధోరణి, స్థానిక అవినీతికి వ్యతిరేకంగా విద్యా ర్థులను, ప్రజలను సమీకరించి భారత ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడంలో కీలకంగా వ్యహరించింది.
అదే తరహాలో ప్రస్తు తం విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సమూహాల కింద సంఘటితమైన నేపాల్ నిరసనకారులు ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరుకున్నారు. ప్రదర్శనకారులు అవినీతి అధికారుల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ‘మేం ఇకపై అధికారంలో దొంగలను సహించం’ అని ఒక నిరసనకారుడు నినదించడం.. నెరవేరని వాగ్దా నాలతో విసిగిపోయిన ఒక తరం ఆగ్రహానికి సంకేతం. ఇది కేవలం యువత ఆందో ళన కాదు, భారతదేశాన్ని పీడిస్తున్న కుంభకోణాల మాదిరిగానే.. ప్రజాధనం ఉన్నతవర్గాల జేబుల్లోకి వెళ్లేందుకు సహకరించే పరిపాలనకు వ్యతిరేకంగా ఒక వ్యవస్థాగత తిరుగుబాటు.
భారత్‌లో ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు..
భారతదేశంలో అవినీతి ఎందుకు అంతగా పెరుగుతోంది?. ఎన్నికల ఖర్చులు తారాస్థాయికి పెరగడం, బ్యాలెట్ బాక్స్‌పై విశ్వసనీయత కోల్పోవ డం వంటివి నేపాల్ దుస్థితిని ఇక్కడ ప్రతిబింబిస్తున్నది.
సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, ఎన్నికల వాచ్‌డాగ్‌ల అంచనాల ప్రకారం రాష్ర్ట అసెం బ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇప్పుడు రూ. 25 కోట్లు ఖర్చు చేస్తుంటే, లోక్‌సభ అభ్యర్థు లు రూ. 40 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతున్నది. 1990 సమయం లో ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. తర చు స్వచ్ఛందంగా విరాళాలు కూడా అందేవి. కానీ తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం నోట్లకు ఓట్లను అమ్ముకునే పరిస్థితి దాపురించింది.
చీరలు, మ ద్యం, మహిళలు, కుటుంబాలకు విందులతో పాటు ప్రత్యక్ష లంచాల రూపంలో ప్రతి ఓటరుకు రూ. 1,000 నుంచి -2,000 అందు తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 1,500 మందికి పైగా అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వీరిలో చాలా మందికి నల్లధనం నిధులు సమకూరుతున్నాయని వెల్లడించిం ది. మీడియా విశ్లేషణ ప్రకారం భారతదేశంలో మొత్తం ఎన్నికల ఖర్చు రూ. లక్ష కోట్లు అని అంచనా ఉంది. ఈ ధనంతో లక్షలాది మందికి పాఠశాలలు నిర్మించవచ్చు.
రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు..
అయితే పర్సంటేజీలతో విసిగిపోయిన రాజకీయ నాయకులు, తమ సొంత సంస్థలను ప్రారంభించడం లేదా తమ బంధువు లు నిర్వహించే సంస్థలకు కాంట్రాక్టులను ఇవ్వడం ప్రారంభించారు. పారదర్శక అంతర్జాతీయ నివేదికల ప్రకారం బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో బినామీ నిర్మాణ సామ్రాజ్యాలు అభివృద్ధి చెంది, 30 ప్రభుత్వ కాంట్రాక్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో విసిగిపోయిన వ్యాపారవేత్త లు రాజకీయాల్లోకి దిగడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారు.
రియ ల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలలో ఉన్న వ్యాపారవేత్తలు బీజేపీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలలో చేరి, సీట్లు గెలుచుకోవడానికి నల్లధనాన్ని ఉపయోగించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకున్నా వీరు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 1000 కోట్ల నగదు పట్టుబడింది. అయినప్పటికీ దోషులను గుర్తించడం, నిర్ధారించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు వ్యాపార వేత్తలు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి పెంచేలా చేశాయి. ఎన్నికలను అవినీతిపరులు మాత్రమే పాల్గొనే బిలియనీర్ వేలంగా మార్చాయి.
స్వతంత్ర సంస్థల పక్షపాత ధోరణి..
ఈ పరిస్థితిని ఎవరు నియంత్రించగలుగుతారు?. గతంలో టీఎన్ శేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆస్తులను స్వాధీనం చేసుకుని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని అనర్హులుగా ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో టీఎన్ శేషన్ ఎంతో కఠినంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిని అవలంభిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2019 తర్వాత, పాలక బీజేపీకి కొమ్ము కాస్తుందని ఆరోపణలున్నాయి. 2014 నుంచి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘనలపై చర్యలు 50 శాతం తగ్గాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేస్తుంది.
ఒకప్పుడు 1990ల హవాలా కుంభకోణం వంటివి -కేసులను సుమోటోగా తీసుకున్న కోర్టులు ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా కేసులను జాప్యం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. చాలా అవినీతి పిటిషన్ల తీర్పు వెల్లడించడాన్ని పెండింగ్‌లో పెడుతున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీకాలంలో అనేక మైలురాయి తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికీ 5 కోట్ల కేసులను పెండింగ్‌లో ఉన్నాయి. ఒకప్పుడు బోఫోర్స్ కేసును బహిర్గతం చేయడంలో మార్గనిర్దేశం చేసిన మీడియా కూడా దీనికి సహకరిస్తుంది. మీడియా కూడా ఇప్పుడు యజమాని- ఆధారిత అజెండాలతో నిండిపోయింది.
రిలయన్స్ మీడియా సంస్థలు లేదా బీజేపీ -అనుబంధ ఛానెల్‌లు వంటి కార్పొరేట్- రాజకీయ ప్రమేయం ఉన్న సంస్థలు దర్యాప్తు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2023 రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రపంచవ్యాప్తంగా 150వ స్థానంలో ఉంది. 70 శాతం మీడియా సంస్థలు వ్యాపార-, రాజకీయ సంబంధాల యాజమాన్యంలో ఉన్నాయి. 2019లోనే రూ. 500 కోట్లు ఖర్చు అయిందని ప్రెస్‌కౌన్సిల్ ప్రకటించిన నేపథ్యంలో మీడియా సంస్థలు పరిశోధనాత్మక జర్నలిజం కంటే పెయిడ్ న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.
భారత్‌లోనూ నేపాల్ తరహా తిరుగుబాటు..!
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ అవినీతి సూచిక స్కోరు 40/100 వద్ద ఉంది. ఈ స్థానం దశాబ్దం నుంచి మారలేదు. నేపాల్ అవినీతి సూచిక మరింత అధ్వాన్నంగా 35 వద్ద ఉంది. కానీ ఆ దేశ యువత వెలిబుచ్చుతున్న ఆగ్రహం అక్కడ మార్పు సాధ్యమని స్పష్టం చేస్తున్నది. అయితే, మన దేశ ప్రాచీన జ్ఞానం, నీతి, విలువలను పరిశీలిస్తే నేపాల్ లాంటి హింసాత్మక ఉద్యమాలు ఇక్కడ జరగకపోవచ్చు.
కానీ అలాంటి తిరుగుబాటును నివారించడానికి, అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ సంస్థలకు నాయకత్వం వహించేవారు దేశం, ప్రజల శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతున్న వారందరూ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, అవినీతి, దుష్ర్పవర్తనలు, ప్రజాధనం దుర్వినియోగం, అధికారంలో ఉన్నవారి విలాసవంతమైన జీవనశైలిని మార్చుకోవాలి. లేనిపక్షంలో భారతదేశానికి కూడా నేపాల్ తరహాలో ఆశ్చర్యకరమైన తిరుగుబాటు ఎదురుకాక తప్పదు.
గతంలో ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాలు..
ప్రస్తుతం భారతదేశంలో పేరుకుపోయిన అవినీతి ఆసక్తికరంగా అనిపిం చొచ్చు. కానీ 1990 కంటే ముందు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిగా గుర్తింపు పొందిన భారతదేశ రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత లాభం కంటే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి పాలనలో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లకు దోపిడీ లేకుండా కాంట్రాక్టులను ఇచ్చేవారు. క్విడ్ ప్రో కో తరహాలో కాకుండా కేవలం ఎన్నికలకు ముందు స్వచ్ఛంద ఆర్థిక సహాయం మాత్రమే కోరుకున్నారు.
1990వ దశకంలోని కాంగ్రెస్ లేదా తొలితరం జనతా పార్టీ వంటి పార్టీల నాయకులు అధికారాన్ని సేవగా భావించి ప్రజాస్వామ్య ఆదర్శవాదానికి ప్రతిబింబంగా నిలిచారు. కానీ ఆ తర్వాత కాలంలో సరీళీకరణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి దురాశ రాజ్యమేలడం మొదలైంది. రాజకీయ నాయకులు అందించే వ్యాపార సహకారానికి ప్రతిఫలం ఆశించడం ప్రారంభించారు. 1995 తర్వాత ఈ మార్పు పెచ్చరిల్లిపోయింది.
ప్రభుత్వం అందించే కాంట్రాక్టులతో కాంట్రాక్టర్లు బాగా లాభపడుతున్నారని గ్రహించిన నాయకులు మొత్తం కాంట్రాక్ట్ విలువలో 10 నుంచి 20 శాతం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత కాలం కాగ్ ఆడిట్‌లలో ఈ విషయం బహిర్గతమైంది. అయితే ముందు జాగ్రత్తగా ఈ లావాదేవీలన్నీ బినామీ ఖాతాలు, షెల్ కంపెనీలు లేదా నాయకుల పేర్లలో చెక్‌ల ద్వారా చెల్లింపులు జరిగాయి. వేల కోట్ల డబ్బును దోచుకున్న 2 జీ స్పెక్ట్రమ్ స్కామ్ (2010), బొగ్గు కేటాయింపు స్కాం (2012) దీనికి ఉదాహరణగా నిలిచాయి.