calender_icon.png 29 November, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో కోతలు

29-11-2025 12:50:08 AM

  1. రైతులకు తప్పని ఇబ్బందులు.. - 

పెద్దసార్లకు తెలిసే జరుగుతుందా..?

మంచిర్యాల, నవంబర్ 28 (విజయక్రాం తి) : జిల్లాలో 2025- ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లు జిల్లాలో ప్రారంభమయ్యాయి. వరి కోతలు ఎలా ఊపందుకున్నాయో.., రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మిల్లులకు పంపితే అదే వేగంగా కోత(కటింగ్)లు షురూ అయ్యాయి...

సీజన్ మొదట్లనే ఇలా బస్తాకు కిలో కటింగ్ పెడితే రాను రాను ఈ పరిస్థితి ఎంత వరకు పోతుందోనని రైతులు భయాందోళనలకు గురవు తున్నారు. వీటిని అదుపు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మిల్లర్లు ఆడిం ది ఆట అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. 

బస్తాకు కిలో ఎక్కువ ఇవ్వాలంటా...

సాధారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాల్లో తూకం వేస్తుంటారు. వేయింగ్ సమయంలో 40 కిలోలతో పాటు గన్ని సంచి బరువుకు బదులు గన్నీ సంచి వేసి తూకం వేయాలి. కానీ 41 కిలోలుగా కాంటా చేసినా రైతు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోడు కానీ 40 కిలోల బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారు.

ఎవరిని అడిగినా ఇది అధికారులు అనధికారికంగా చెబితేనే వేస్తున్నామని, 42 కిలోలకు వంద గ్రాములు తగ్గినా కోత విధించుడే అంటూ పంపిన బస్తా ల సంఖ్యను తగ్గించేస్తున్నారు. అంతే కాకుండా లారీ టోటల్ వేయిట్‌లో సైతం తక్కువ వచ్చి నా రైతే భరించాలి. ఇదంతా కొనుగోలు కేంద్రాల్లో ఇంఛార్జీల తీరు. ఒక రైతుకు వంద బస్తాల దిగుబడి వస్తే క్వింటాలు అప్పనంగా మిల్లర్ కు అప్పగించాల్సి వస్తుంది. 

కాంటా షార్టేజి పేరిట దోచుడే...

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం టీకనపల్లి నుంచి 533 బ్యాగులతో ముగ్గురు రైతుల ధాన్యం మిల్లుకు పంపించారు. కాంటా సమయంలో 40 కిలోల బస్తాకు 42 కిలోల తూకం వేశారు. ఇక్కడ రైతులు బస్తాకు కిలో నష్టపోయారు. అయినా పర్వాలేదనుకుంటే వీరికి మరో షాకిచ్చారు. కాంటా షార్టేజీ పేరిట మరో 9 బస్తాల కోత విధించారు. అంటే కోత విధించిన ధాన్యం విలువ సుమారు 10 వేల రూపాయలు.

ఒక లారీకీ బస్తాకు కిలో ఎక్కువ చొప్పున సుమారు ఐదు క్వింటాళ్లు (సుమారు రూ. 15 వేలు) నష్టపోతున్నారు. ఇలా ఒక లారీకే రూ. 20 నుంచి రూ. 30 వేలు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ విలువ లారీలోని బస్తాల సంఖ్య ఆధారంగా తగ్గవచ్చు, పెరగవచ్చు. కాంటా చిట్టీలో ధాన్యం వెయింగ్ 21,955 కిలోలు అంటే 41 కిలోల తూకంతో సరిచూస్తే 535 బస్తాలకు సమానం.

కానీ మిల్లర్ 524 బస్తాలకు రిసీవ్డ్ ఇచ్చారు. మిగితా 11 బస్తాలు ఎవరికో అధికారులకే తెలియాలి. ఇది ఒక లారీకే, ఇప్పటి వరకు పంపిన లారీలన్నింటి తూకం చూస్తే ఎన్ని వందల క్వింటాళ్లు ఇలా ఎక్కువగా వెళ్లాయో భయటపడుద్ది. మరి అధికారులు ఆ లెక్కన చూస్తారా..? కండ్లు మూసుకుంటారో వేచి చూడాల్సిందే...

పెద్దసార్లకు తెలిసే జరుగుతుందా..?

జిల్లాలో ధాన్యం బస్తాకు కిలో అధ నం కండీషన్ అధికారులకు తెలిసే జరుగుతుందా..? నిర్వాహకులేమో ఎవరికైనా చెప్పు, అదే అంటారని చెప్పడం, రైతులేమో ఏం చేసేది లేక ఎంతంటే అంత తూకం వేయించి అమ్మడం, అయినా వెయిట్ లాస్ అంటూ కోతలు విధించడం పరిపాటిగా మారింది. ఇదంతా క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న అధికారులకు కనిపించడం లేదా..?

ట్రక్ షీట్ లో పంపిన బస్తాలను కొట్టివేసి బస్తాల సంఖ్య మార్చి ఇచ్చినా అవి వారి దృష్టికి రావడం లేదా..? మిల్లర్లు  ఇచ్చే తాయిళాలకు ఆశ పడి రైతులు పండించిన పంటను తాలు, తప్ప, కాంటా షార్టేజీ పేరిట కిలోల కొద్ది దోచుకుతింటున్న మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని సంప్రదించగా సమాధానం ఇవ్వలేదు.