22-11-2025 05:49:08 PM
చేవెళ్ల (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధి దామరగిద్ద వార్డులోని దత్తపీఠం క్షేత్రంలో శనివారం చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట్ రంగారెడ్డి ఆధ్వర్యంలో పాండు గురు స్వామి కరకమలములచే అయ్యప్ప మహపడిపూజ కన్నుల పండువగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో దత్తాపీఠ క్షేత్రం మార్మోగింది. గణపతి పూజ, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి 18 పడి మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశేఖర్ భజన బృందంచే భక్తి గీతాలు ఆలపించారు.
అయ్యప్ప స్వామి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మహా పడిపూజ జరిపి పడిని కాల్చారు. అనంతరం భక్తులు, స్వాములకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి, యువ నాయకులు డాక్టర్. మల్గారి వైభవ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బ్యాగరి రాములు, చేవెళ్ల అయ్యప్ప సన్నిధాన స్వాములు, భక్తులు పాల్గొన్నారు.