19-07-2025 02:22:55 AM
- రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
- ఆగివున్న లారీని ఢీకొన్న కారు
- ఆదిభట్ల పరిధిలోఘోర ప్రమాదం
తుర్కయంజాల్, జూలై 18: ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండ లం, తాండ్ర గ్రామానికి చెందిన గగులోత్ జనార్దన్ (45) లేబర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం పాకాలకు చెందిన మాలోత చందులాల్ (29) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
మొయినాబాద్ ఎల్కలపల్లికి చెందిన కావలి బాలరాజు (40) వ్యాపారం చేస్తున్నాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వెదుల్లవలసకు చెందిన దాసరి భాస్క ర్ రావు (39) సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కమల్రాజుపేటకు చెందిన జాడ కృష్ణ (25) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా మొయినాబాద్ మండలం గ్రీన్ వ్యాలీ రిసార్టులోనే పనిచేస్తున్నట్లు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున యాదగిరిగుట్టకు వెళ్లి కారు లో తిరిగి వస్తుండగా పెద్ద అంబర్‌పేట- మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని కారు వెనుకనుంచి ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిం ది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు లోపల ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఇద్దరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తెల్లవారుజామున 3.30కి ప్రమాదం జరగడంతో పోలీసులు వచ్చేవరకు క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాధితులను వెలికితీ సేందుకు పోలీసులు మూడుగంటలపాటు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టుమార్టం పూర్తిచేశారు.