19-07-2025 01:48:24 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడుతారనే విషయంలో స్పష్టత కరువైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలోనే మార్గదర్శకాలను జారీ చేసిన విద్యాశాఖ.. మళ్లీ నియామకాల గురించి ఊసెత్తడంలేదు. మరోవైపు నియామకాలను ఎప్పుడు చేపడుతారని నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తు న్నారు.
వేలాదిమంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 2014 నుంచి దాదాపు ఇప్పటివరకూ యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ జరగనేలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ నూతన మార్గదర్శకాలకు సంబంధించి ఏప్రిల్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మూడు నెల లు కావొస్తున్నా ప్రక్రియ ముందుకు సాగడంలేదు.
ఇటీవల ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన వర్సిటీలు గత నెల చివరి వారంలో పాలకమండళ్ల సమావేశాలను నిర్వహించి దాదాపు 500 వరకు ఖాళీలను భర్తీ చేయాలని ఆమోదం తెలిపాయి. త్వరలోనే మిగతా వర్సిటీలు సైతం సమావేశాలను పూర్తిచేసుకునే పనిలో ఉన్నా యి. వర్సిటీల్లోని ఖాళీలకు సంబంధించి అదిగో ఇదిగో అంటూ హడావుడి చేసి చేతులుదులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఒక్కడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనేలా నియామకాల అంశం ముందుకుసాగుతోంది. సంవత్సరాల తరబడిగా నియామకాలు జరపకపోవ డంతో తాము ఆచార్యులయ్యేదెప్పుడని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్సిటీల్లో ఖాళీలు భారీ గా పేరుకుపోవడంలో విద్యాబోధన కుంటుపడుతోంది.
పన్నెండేళ్లుగా నియామకాల్లేవ్..
రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీల్లో పన్నెండేళ్లుగా నియామకాలు చేపట్టలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాలను చేపట్టాలని భావించి దాదాపు 1,060 పోస్టులను భర్తీ చేయాలనుకుంది. కానీ అది ముందుకు సాగలేదు. తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లోని ఖాళీలపై దృష్టి సారించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టింది.
ఈక్రమంలోనే అ సిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకుగానూ గత ఏప్రిల్‌లో నూతన మార్గదర్శ కాలు జారీ చేసింది. దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు తమను రెగ్యుల రైజ్ చేశాకే భర్తీ ప్రక్రియ చేపట్టాలని సమ్మె చేపట్టగా ఆ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. త ర్వాత ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల నుంచి తీసేయబోమని కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
ప్రస్తు తం యూనివర్సిటీల్లో 80 శాతం వరకు ఖా ళీలున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే బో ధన కొనసాగుతోంది. కొన్ని విభాగాలకైతే హెచ్‌వోడీలు లేరు. దీంతో వర్సిటీల్లో పరిశోధనా విద్య కుంటుపడుతోంది. దీని ప్రభా వం న్యాక్ గ్రేడ్‌పై పడుతోంది. పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. నాణ్యమైన వి ద్య అందడంలేదనే విమర్శలున్నాయి.
2,900 పోస్టులు ఖాళీ..
గత కొన్నేండ్లుగా యూనివర్సిటీల్లో ని యామక ప్రక్రియ అటకెక్కడంతో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. ఆర్‌జీయూకేటీ మహబూబ్‌నగర్, శాతవాహన వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, లా కాలేజీలకు తాజా గా మంజూరైన పోస్టులు మినహాయించి మిగతా యూనివర్సిటీల్లో 2,878 టీచింగ్ పోస్టులు మంజూరు ఉండగా, గత ఏప్రిల్ వరకు 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,524 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా, వీటిలో 1,061 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
అయితే 12 యూనివర్సిటీల్లో మొ త్తం పోస్టులు 2,900 వరకు ఖాళీలున్నట్లు తెలుస్తోంది. సాంక్షన్డ్ పోస్టుల్లో వర్సిటీల్లో పనిచేస్తున్న వారు కేవలం ఐదారొందల మంది మాత్రమే ఉంటున్నారంటే వర్సిటీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే విద్యాశాఖ మాత్రం పలు దఫాలుగా భర్తీ చేయాలని భా విస్తోంది. తొలుత విద్యార్థులెక్కువ, డిమాం డ్ ఉన్న కోర్సుల్లో సరిపడా ప్రొఫెసర్లు ఉం డేలా నియామకాలను చేపట్టాలని అనుకుంటున్నారు.
పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయాలి
యూనివర్సిటీల్లోని దాదాపు 3 వేల టీచింగ్ ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలి. ఐదారు వందలు భర్తీ చేస్తామంటే ఊరుకోం. పది పన్నెండేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకప్రక్రియనే చేపట్టలేదు. గత ప్రభుత్వం కూడా భర్తీ చేస్తామని ప్రకటించి కాలయాపన చేస్తోంది. స్వరాష్ట్రంలో ఉద్యోగాలొస్తాయని ఆశగా ఎదురుచూశాం. కానీ నోటిఫికేషన్లను ఏ ప్రభుత్వమూ విడుదల చేయడంలేదు. కేవలం యూనివర్సిటీల్లోని పోస్టులనే కాదు డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర ఉన్నత విద్యాసంస్థల్లోని టీచింగ్ ఫ్యాకల్టీలకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు చేపట్టాలి.
ఉదయ్ హరీశ్‌గౌడ్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు