19-07-2025 01:59:54 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 18 : ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా హైదరాబాద్‌ను శుక్రవారం సాయం త్రం భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంట ల వరకు సుమారు నాలుగు గంటల పాటు ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. అత్యధికంగా మారెడ్‌పల్లి లో 11.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొన్ని లోతట్టు ప్రాం తాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయంకా వడంతో పాటు కొన్నిచోట్ల నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. షేక్‌పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, మియాపూర్ వంటి ప్రాంతా ల్లో భారీ వర్షం కారణంగా ప్రజలు అవస్థలు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రాయదుర్గం, షేక్‌పేట మార్గంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఐటీ కారిడార్‌లోని రోడ్లు నాలాలను తలపించగా, రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలిచౌకి, మెహదీపట్నం మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టింది. టోలిచౌకి నానల్నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లి, వాహనాలను నిలిపివేసింది.
కొత్తగూడ ఫ్లుఓవర్ మీద మోకాలి లోతు నీరు నిలిచింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడా ప్రాంతాలు జలసంద్రంగా మారాయి. ముషీరాబాద్, కవాడిగూడ, గాంధీ నగర్, రాంనగర్, అడిక్‌మెట్, భోలక్‌పూర్ డివిజన్‌లలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో రోడ్ల మీద వరద నీరు ప్రవహించింది.
ఇందిరాపార్క్, అశోక్ నగర్, అరుంధతి నగర్, బాగ్ లింగంపల్లి, పద్మా కాలనీ, తదితర బస్తీలు, కాలనీల్లో వరద నీరంతా వాగులా ప్రవహించింది. సనత్‌నగర్‌లో కాలనీలు వర్షపు నీరు, మురుగు నీటితో నిండి పోయాయి. మురుగు నీరు మ్యాన్‌హోల్స్ నుంచి ఉప్పొంగింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను కూడా తాత్కాలికంగా నిలిపేశారు.
సహాయక బృందాల చర్యలు
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమై వరద నివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిండు కుండలా హుస్సేన్‌సాగర్
గ్రేటర్ హైదరాబాద్‌ణు ముంచెత్తిన భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌కు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ నిండు కుం డలా మారింది. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ నీటిమట్టం ఎఫ్‌టీఎల్‌కు చేరువలో ఉండటంతో అధి కారులు అప్రమత్తమయ్యారు. ఎఫ్‌టీఎల్ 513.41 మీటర్లు కాగా, శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 513.38 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్‌లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్‌ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు గనుక మరింత కురిస్తే హుస్సేన్‌సాగర్ పరిధిలోని లోత ట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
కాలనీలను ముంచెత్తిన ప్యాట్నీ నాలా
ఏటా వర్షాకాలం తమ కాలనీలు నీట మునుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలా విస్తరణకు హైడ్రా చర్యలు తీసుకుంది. అయి తే ఓ ఇంటి యజమాని పనులను అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో గతంలో మాదిరే సమస్య తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో చిక్కున్న వారిని డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయం తో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లో బోటులో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను పర్యవేక్షించారు.
నీట మునిగిన పైగా కాలనీ
సికింద్రాబాద్‌లో పైగా కాలనీ నీట మునిగిం ది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరులో కొన్ని పరిశ్రమలు, షోరూ మ్స్ ఉద్యోగులు చిక్కుకున్నారు. చిక్కుకున్న వా రందరినీ బోట్ల సాయంతో హైడ్రా సిబ్బంది బ యటకు తీసుకొచ్చారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ స్వయంగా బోటులో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్యాట్నీ నాలా విస్తరణ పనులు ఓ ఇంటి యజమాని అడ్డుకోవడంతో నిలిచిపోయాయని, అందుకే సమస్య మళ్లీ తలెత్తిందని స్థానికులు ఆరోపించారు. అంబర్‌పేట బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.