calender_icon.png 19 July, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసుకోండి.. కాదంటే పోరాటమే!

19-07-2025 02:04:27 AM

మమ్మల్ని బతకనివ్వండి.. మా ప్రాజెక్టులు కట్టుకోనివ్వండి

  1. ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా.. 
  2. పోరాటాలు మాకు కొత్త కాదు.. నేనే నాయకత్వం వహిస్తా
  3. అక్కున చేర్చుకున్న పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీలేదు 
  4. ఈ పాలమూరు బిడ్డే మరో పదేళ్లు సీఎం..
  5. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత ప్రజాప్రభుత్వానిదే.. 
  6. రెండున్నర ఏండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
  7. కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోలు బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి

నాగర్‌కర్నూల్, జూలై 18 (విజయక్రాంతి):  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాలని,  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు  తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అడ్డుపడవద్దని చంద్రబాబును కోరారు.

‘నాడు పాలమూరు ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మీరు బాధ్యతగా ఉండి మమ్మల్ని బతకనివ్వండి.. వినకపోతే  పాలమూరు బిడ్డ లకు పోరాటం కొత్తేమీ కాదు.. ఆ పోరాటాలకు నేనే నాయకత్వం వహిస్తా.. అక్క డి సూర్యుడు ఇక్కడ వచ్చినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పలు అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో  కలిసి ప్రారంభించారు.

అనంతరం జటప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరం గసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు కొట్లాడిందే కొలువుల కోసమని,  కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా తన కుటుంబంలోని అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగులకు మొండిచేయి చూపా రని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉ ద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తమదేనన్నా రు. ఏడాదిన్నరలోగా జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ల్ నిర్మాణం పూర్తి చేస్తామని మళ్లీ ఇక్కడికి వచ్చి స్కూల్ ను ప్రారంభిస్తానన్నారు. 

మాజీ సీఎం కేసీఆర్ శాపగ్రస్తుడు..

తెలంగాణ ఉద్యమ సమయంలో వలసజీవిగా వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు బిడ్డ లు అక్కున చేర్చుకొని పార్లమెంట్‌కు పంపితే కనీసం  కొట్లాడలేదని ఎంతోమంది నిరుద్యోగులు తమ ప్రాణాలను బలి తీసుకుం టుంటే చలించిపోయిన సోనియాగాంధీ తె లంగాణ రాష్ట్రం ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యమం ముసుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ల కాలంలో పాలమూరు బిడ్డలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవడం కోసం నాడు జీవో నెంబర్ 98 తీసుకువస్తే పార్లమెంటుకు పంపిన కృతజ్ఞత కూడా ఉంచుకోకుండా అన్నం పెట్టి అక్కున చేర్చుకున్న పాలమూరు బిడ్డలకు సున్నం పెట్టాడని మండిపడ్డారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ గొర్లు, బర్లు, చేపలు అంటూ ఆ వర్గాలు చదువుకోకుండా కుట్రలు చేశారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కు టుంబ పిల్లలతో సమానంగా ఆ వర్గాల వారు చదువుకుంటున్నారన్న దుర్బుద్ధితోనే కేసీఆర్ దుఃఖపడుతున్నాడని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రంగాల్లో చేయూతను అందిస్తూ అం బానీ, ఆదానీతో సమానంగా పెట్రోల్ బం కులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సులు వంటి వాటికి ఓనర్లుగా మహిళా మండలిని తయారు చేశామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్ తన బిడ్డకు బంగ్లా, కొడుకుకి ఫామ్‌హౌస్ కట్టించాడు కానీ రాష్ట్రంలోని మహిళలను ఏ రోజు పట్టించుకోలేదన్నారు.

కనీసం ఐదేళ్లపాటు తన మంత్రివర్గంలో మహిళలకు చోటివ్వలేదన్నారు. తన కళ్లముందే తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతోందని కేసీఆర్ కంటకన్నీరు పెడుతున్నాడని, తనకు ఈ పాపాలన్నీ తగిలి శాప గ్రస్తుడిగా మారడన్నారు. అందుకే అసెంబ్లీకి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. 2035 వరకు ఈ పాలమూరు ప్రాంత బిడ్డే ప్రజా పాలన కొనసాగిస్తాడని స్పష్టం చేశారు.

వాల్మీకిబోయలను మోసం చేసిన కేసీఆర్..

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ వాల్మీకి సోదరులను కేసీఆర్ మో సం చేశారని, కేసీఆర్ మాటలను నమ్మి వా ల్మీకి సోదరులు మోసపోయారే తప్ప బాగుపడింది లేదని రేవంత్‌రెడ్డి అన్నారు.  పదేళ్ల లో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పా లమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన చూసి కేసీఆర్‌కు దుఃఖం వస్తుందట..

పాలమూరు గడ్డ నుంచి రేవంత్‌రెడ్డి సీఎం అ యిండని నీకు దుఃఖం వస్తున్నదా... బలహీ న వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూ ల్ నిర్మిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తున్నదా? పాలమూరు బిడ్డ 20 ఏండ్లు ముఖ్య మంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నందుకా నీకు దుఃఖం..’ అని ప్రశ్నిం చారు.

౪౦ ఏళ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే, మాదిగ ఉపకు లాల వర్గీకరణ చేసినందుకా నీకు దుఃఖమని నిలదీశారు.  ‘నీ కొడుకు, నీ మనుమడిలాగే మా దిగ బిడ్డలు చదువుకుంటున్నందుకా నీకు కళ్లల్లో నీళ్లు వస్తున్నాయా?’ ని ప్రశ్నించారు. 

దొంగలకు సద్దులు మోస్తున్న శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి..

పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి మా జీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి.. దొంగకు సద్దులు మోస్తున్నారని ఎవరికి ఏదీ జరగలేదని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.  కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. 

పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదు..

పదేళ్లు సీఎంగాఉండి పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారని, పాలమూరు-రంగారెడ్డిని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నామన్నారు.  కడుపులో విషం పెట్టుకుని తమపై కేసీఆర్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.