calender_icon.png 19 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ముగ్గురంటే భయం

19-07-2025 01:45:43 AM

  1. తన పదవికి ఎసరు పెడుతారని మంత్రుల ఫోన్లు ట్యాపింగ్
  2. బనకచర్లపై సీఎం డైవర్షన్ పాలిటిక్స్.. లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి?
  3. టన్నుల కొద్ది కేసులు పెట్టారు.. ఒక్క ఆధారం చూపలేదు
  4. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ ఆడుకుంటాం
  5. ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మండిపాటు

ఖమ్మం, జూలై 18 (విజయక్రాంతి): తన పదవికి ఎక్కడ ఎసరు పెడతారోనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాబినెట్‌లోని ముగ్గురు మంత్రులు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తనపై టన్నుల కొద్ది కేసులు పెట్టారని, చివరకు గుండు సూదంత ఆధారం చూపలేదని కేటీఆర్ మండిపడ్డారు.

దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని, తనపై సీఎం ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, తాను జీవితంలో ఏనాడూ సిగరెట్ కూడా తాగలేద న్నారు. ‘నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు.. ఓసారి కార్ రేసింగ్ అంటున్నారు.. రేవంత్‌రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం చేకూరలేదన్నారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఆర్‌జేసీ కృష్ణ, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, ఖామర్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అర్ధరాత్రి తాను లోకేశ్‌ను కలిసినట్లు సీఎం తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారని, తాను ఏది చేసినా బాజాప్తా చేస్తానన్నారు. అర్ధరాత్రి లోకేశ్‌ను కలిసే అవసరం తనకు లేదన్నారు.  లోకేశ్ నీలాగా సంచులు మోసేటోడు కాదని, ఆయన్ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

యువకుడైన లోకేశ్‌కు తనకు సత్సంబంధాలున్నాయని, పక్క రాష్ట్ర మంత్రి అని, అయినా మీ పెద్దబాస్ చంద్రబాబు కొడుకే కదా.. ఎవరో దావుద్ ఇబ్రహీంను కలిసినట్లు ఆ ఉలిక్కిపాటు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీలాగ చీకట్లో పోయి అమిత్ షా కాళ్లు పట్టుకుని, మోదీ పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేయడం లేదు కదా.. దొంగతనం చేయడం, దొరికిపోవడం రేవంత్‌రెడ్డి నైజం..’ అన్నారు.

బనకచర్లపై చర్చ గురించి వెళ్లనంటివి కదా..

బనకచర్లపై చర్చ గురించి ఢిల్లీకి వెళ్లేదిలేదని..వెంటనే మాట మార్చి ఎందుకు వెళ్లావని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి బనకచర్లపై చర్చ లేదని చెబితే ఆంధ్ర మంత్రి నిమ్మల రామానాయుడు మొట్టమొదటి అజెండానే బనకచర్ల అని చెప్పింది నిజం కాదా.. 30 రోజుల్లో కమిటీ వేస్తామని చెప్పింది నిజం కాదా.. ’అని కేటీఆర్ ప్రశ్నించారు.  అసలు విషయం పక్కకు నెట్టి రేవంత్‌రెడ్డి డైవర్షన్ గేమ్‌లతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నాడు నోట్లు కట్టలతో దొరికి నేడు ప్రజల నోట్లో మట్టికొడుతున్నాడని అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 20 నెలల్లో అటు రాష్ట్రానికి, ఇటు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడుతామని హెచ్చరించారు.

రేవంత్ గ్యారెంటీలు ఇవి..

ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి తన కోసం ఏర్పాటు చేసుకున్న ఆరు గ్యారెంటీలను మాత్రం రేవంత్‌రెడ్డి తప్పకుండా అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ.. బాబు కోసం బనకచర్ల గ్యారెంటీ.. రాహుల్ కోసం బస్తాలు, మూటలు నోట్లకట్లలు గ్యారెంటీ.. బావమరిది కోసం అమృత్ కాంట్రాక్ట్ గ్యారెంటీ.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు గ్యారెంటీ.. చివరిది నెలకోసారి ఢిల్లీ గ్యారెంటీ.. చీకట్లో మోదీ కాళ్లు పట్టుకోవడం గ్యారెంటీ..’ అంటూ సెటైర్లు వేశారు. సవాళ్లు ఎక్కడ ఎప్పుడు చేసినా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం సున్నా..

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మం త్రులున్న ఉపయోగం సున్నా అని కేటీఆర్ మండిపడ్డారు. 42శాతం రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ పేరుతో బీసీలను దారుణంగా మోసం చేశారని, ఎరువులు, విత్తనాల కొరతతో రైతు లు ఆగం అవుతుంటే ప్రభుత్వం మొ ద్దునిద్ర పోతుందన్నారు. రైతులు తీ వ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి, మంత్రికి కళ్లు కనపడడం లేదా అని ప్రశ్నించారు. 

రేవంత్ లాంటి దుర్మార్గులు ఉంటారని అం బేద్కర్ కూడా ఊహించలేకపోయారన్నారు. ఓటు వేసిన పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగా ణలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరిని కాం గ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అందు కే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారన్నారు.