calender_icon.png 19 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై న్యాయసలహా!

19-07-2025 02:20:36 AM

అధికారులకు గవర్నర్ ఆదేశం

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. శుక్రవారం హైదరా బాద్‌లోని రాజ్‌భవన్‌లో కీలక సమావేశం నిర్వహించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సిఫార్సు ముసాయిదాపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే ఆర్డినెన్స్ ఫైల్‌పై న్యాయ సలహా తీసుకోవడంతోపాటు రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాల నుంచి నోట్ తీసుకోవాలని సూచించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ బిల్లును రూపొందించగా మార్చి 17న అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లును చట్టం చేసేందుకు పార్లమెంట్‌కు పంపించారు.

అక్కడ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే గవర్నర్‌కు పంపినప్పటికీ ఇంకా ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్టు చర్చ జరుగుతోంది.

ఈ బిల్లు రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్‌ను సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటడం వల్ల ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలను గవర్నర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ న్యాయ సలహా కోరడంతో ఆసక్తి నెలకొంది.