29-11-2025 12:00:00 AM
పెరుగుతున్న హాంకాంగ్ అగ్నిప్రమాద తీవ్రత
విక్టోరియా, నవంబర్ 28: హాంకాంగ్‌లోని తాయ్‌పో పట్టణం ‘వాంగ్ ఫుక్ కోర్ట్ ఎస్టేట్’ 32 అంతస్తుల భవన సముదాయం లో ఇటీవల సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం రోజురోజుకూ పెరు గుతూ వస్తున్నది. గడిచిన 80 ఏళ్లలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా ఇదేనని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తమ అంచనాకు మించి మరణాలు నమోదవుతున్నాయని వాపోయింది.
శుక్రవారం నాటికి రెస్క్యూ సిబ్బంది శిథిలాల నుంచి 128 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో హాంకాంగ్ పౌరులతోపాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియాకు చెందిన వలస కార్మికులు ఉన్నారు. పోలీసులు ఇప్పటివరకు ‘ప్రెస్టీజ్ కన్‌స్ట్రక్షన్’ నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
భవన సముదాయంలోని ఫ్లాట్ల కిటికీలకు మండే స్వభావం ఉండే బోర్డులు వాడటం, భవనం వెలుపల ఫైబర్, కాటన్ వస్తువులు ఉండటమే అగ్నిప్రమాదానికి కారణమని అక్కడి ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ఆ దేశ అధినేత జాన్ లీ 300 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల సహాయ నిధి ప్రకటించారు.