calender_icon.png 18 November, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రుణాల పునర్‌వ్యవస్థీకరణ!

16-08-2024 12:31:32 AM

  1. ప్రపంచబ్యాంకుతో సానుకూల చర్చలు
  2. 31,532 కోట్ల పెట్టుబడులు తెచ్చాం
  3. అమెరికా, కొరియా టూర్‌తో ౩౦ వేల ఉద్యోగాలు
  4. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా పరిచయం చేశాం
  5. ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు ౧2 వేలు
  6. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
  7. గోల్కొండ కోటలో జాతీయ జెండావిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ‘మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.౩౧ కోట్లకుపైగా పెట్టుబడులు సాధించామని, వీటి ద్వారా ౩౦ వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై జాతీయ జెండాను సీఎం గురువారం ఆవిష్కరించారు.

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సైనిక అమర వీరుల స్థూపంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం గోల్కొండ కోటలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. రాష్ట్ర అప్పులను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంలో ఉన్నామని, ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై సానుకూల చర్చలు జరిగాయని చెప్పారు.

గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం వేసే పనులు తాము చేయబోమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరం పరిష్కరించుకోవడానికి ఏపీ సీఎంతో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆకాంక్షించారు. ప్రజా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి గత ఏడాది డిసెంబర్ 3న రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని పొందారని పేర్కొన్నారు. 

తెలంగాణను ఫ్యూచర్ సిటీగా పరిచయం చేశాం

రంగుల మేడలు, అద్దాల గోడలు ప్రజల జీవితాలను మార్చలేవని సీఎం అన్నారు. విశ్వవేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని చెప్పారు. బేగరి కంచె వద్ద ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని, జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా రూ.40 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు.

అమెరికా, దక్షిణ కొరియాలో ఇటీవల 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపి, రూ.31,532 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకొన్నామని తెలిపారు. వీటి ద్వారా తెలంగాణలో 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశామని చెప్పారు. కొత్త నగరంతోపాటు ఉన్న నగరాన్ని కూడా ప్రణాళికబద్ధంగా నిర్వహించడానికి, పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని ఆకాంక్షించారు. రైతులు, యువత, మహిళ, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇచ్చారు.

త్వరలో రైతు భరోసా

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున అందించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తెలిపారు. గతంలో రైతుబంధు పథకం కింద అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ స్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోందని, త్వరలోనే ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు.

సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు.

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబొతున్నట్లు చెప్పారు. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్‌లో పని చేయాలని సంకల్పించామని వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

రుణమాఫీ అమలుచేసి చూపిస్తున్నాం

తెలంగాణ రైతన్నలు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులొచ్చాయని సీఎం తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ అమలుచేసి చూపిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ అసాధ్యమని ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయని విమర్శించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానివారిని గుర్తించి సమస్యలు పరిష్కరించి రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టరేట్లలో కౌంటర్లు ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తున్నదని వెల్లడించారు. రూ.500కే వంటగ్యాస్ పథకం కింద లబ్ధిదారులు ఉపయోగించిన 85 లక్షల 17 వేల 407 సిలిండర్లకు రూ.242 కోట్లు చెల్లించామని ప్రకటించారు. రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తున్నామని, మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీపూ బలోపేతం చేశామని వివరించారు.

నిరుద్యోగులకు పెద్దన్నగా అండగా ఉంటా

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు సీఎం చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్ ప్రాథమిక పరీక్షను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. గ్రూప్ 2, 3 చిక్కుముళ్లను పరిష్కరించామని, ఇటీవలే జాబ్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టామని వివరించారు. ఏమైనా సమస్యలుంటే నిరుద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఎవరి ఉద్యోగాల కోసమో నిరుద్యోగులు తమ జీవితాలను బలి చేసుకోవద్దని, పెద్దన్నగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్‌లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తిచేసిన అర్హులైన యువతకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. గోల్కొండ కోటలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం.. పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు. సాంస్కృతిక కళారూపాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. జెండావిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.