calender_icon.png 17 November, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం.. నూకగా మాయం!

16-08-2024 12:26:38 AM

పీడీఎస్ బియ్యాన్ని నూకగా మార్చి విక్రయం

వ్యాపారానికి మండలాల్లో ప్రత్యేక కేంద్రాలు

గ్రామాల్లో ప్రత్యేక ఏజెంట్లు.. వారికి గిర్నీలు 

వారి ద్వారా బియ్యం సేకరించి.. నూకగా మార్పు

రేషన్ బియ్యం దందా వెనుక సూర్యాపేట వ్యాపారి 

మిల్లుల పేరుతో బిల్లులు సృష్టించి అక్రమ రవాణా

కోట్ల రూపాయల్లో మాఫియా దందా

సూర్యాపేట, ఆగస్టు 1౫ (విజయక్రాంతి): రేషన్ బియ్యం మాఫియా పంథా మార్చింది. సాధారణంగా చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి మిల్లుల్లో సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తుంటారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు నిఘా పెట్టి తరచూ దాడులు నిర్వహిస్తుండటంతో అడ్డంగా దొరికడం.. ఆపై మిల్లులు సీజ్, కేసులు నమోదు వంటి ఘటనలు గతంలో జిల్లాలో చోటుచేసుకున్నాయి. అయితే, పేదల బియ్యంతో అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడిన మాఫియా రూటు మార్చింది.

తాము ఎక్కడా దొరకకుండా ఉండేందుకు గ్రామాల్లో ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరించి సాధారణ రైస్ మిల్లుల్లో నూకగా మార్చి యథేచ్ఛగా టాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. నూకల ఎగుమతి, దిగుమతిపై అధికారుల నిఘాగానీ, ప్రభుత్వ నిషేధం కానీ లేకపోవడంతో ఈ దందా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న ఈ దందాలో ఎంత లాభాలు ఉన్నయో.. 

 దందాను ఓ కంటితో చూస్తున్న ఈ శివుడికే ఎరుకా అని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. 

గ్రామాల్లో ఏజెంట్లు..

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని నూకలుగా మార్చి అక్రమ రవాణా చేసే దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఈ దాందా సాగుతున్న ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ దుకాణాన్ని తెరిచిన ఆ వ్యాపారి దర్జాగా దందా చేస్తున్నాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామాల్లో ఏజెంట్లను సైతం ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. వీరికి ఇంట్లో అమర్చుకోవడానికి వీలుగా ఉన్న గిర్నీలను సరఫరా చేశాడని సమాచారం. ఈ ఏజెంట్లు లబ్ధిదారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.8 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఏజెంట్లు తాము సేకరించిన బియ్యా న్ని అతను అందించిన మిల్లుల ద్వారా నూకలుగా మార్చుతున్నారు. ఈ నూకలను కిలో రూ.18 చొప్పున సదరు వ్యాపారి కొనుగోలు చేస్తున్నాడు. 

కోట్లలో వ్యాపారం 

ప్రతి నెలా సూర్యాపేట జిల్లాలో సుమా రు 15 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతున్నది. ఇందులో సుమారు 80 శాతం బియ్యం వివిధ రూపాల్లో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుందని సమాచారం. సాధారణంగా ప్రతి నెల 15 వరకు లబ్ధిదారులకు రేషన్ అందిస్తారు. ఇదే సమయంలో అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, నూకల దం దా చూడటానికి చిన్నదిగా కనబడుతున్నా.. ప్రతి నెల రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన వ్యాపారి జిల్లా కేంద్రంతో పాటు చివ్వెంల, పెన్‌పహాడ్, ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డిగూడెం మండలాల్లో దుకాణాలను తెరిచా రు. వీటి ద్వారా తాను ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా నూకలను కొనుగోలు చేస్తున్నాడు.

అదే విధంగా పలు మండలాల్లో నూకల దందా చేస్తున్న చిరు వ్యాపారులు కూడా ఇతనికే విక్రయిస్తున్నారు. కాగా, ఈ వ్యాపారి నిత్యం 4 లారీల నూకలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి లారీలో సుమారు 40 టన్నుల నూకలు రవాణా అవుతున్నట్టు సమాచా రం. అంటే రోజు 160 టన్నుల నూకల రవాణా జరుగుతున్నది. ఒక టన్ను నూకలు ఇతర రాష్ట్రాల్లో రూ.28 వేలకు విక్రయిస్తున్న ట్టు సమాచారం. ఈ లెక్కన ప్రతి రోజు దా దాపు రూ.౪౦ లక్షల విలువైన నూకలు రా ష్ట్రం సరిహద్దులు దాటుతున్నాయి. నెలలో 15 రోజలు ఈ వ్యాపారం కొనసాగుతున్న ట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా సు మారు రూ.6 కోట్ల వ్యాపారం జరగుతున్నది. 

నిఘా లేక చెలరేగుతున్న మాఫియా

నూకల రవాణాపై నిఘా లేకపోవడంతో అక్రమార్కులు ఈ దందావైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో అక్కడక్కడ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా.. వ్యాపారులు పట్టుబడుతున్నా.. పీడీఎస్ బియ్యం బస్తా మారితే పట్టకునే అవకాశం లేదని, నూకలను పట్టుకోవడం తమ బాధ్యత కాదని సివిల్ అధికారులు తెలుపుతుండటంతో ఈదందాకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. సరిహద్దు చెక్‌పోస్టుల్లో నూక లేదా పరం అంటే పోలీసులు కూడా మామూలుగానే వదిలేస్తున్నారు. ఈ వ్యాపారులు మిల్లుల పేరుతో బిల్లులు సృష్టించి బార్డర్లు దాటిస్తున్నారు. ఇంత జరుగతున్నా.. విషయం సివిల్ సప్లయ్ అధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం అనుమా నాలకు తావిస్తోంది..