27-07-2025 01:25:32 AM
భూముల బదిలీపై కమిషనర్ కర్ణన్ అధ్యక్షతన కీలక సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): హెచ్‌సిటీ ప్రాజెక్టు కింద ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఎఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూముల బదిలీని వేగవంతం చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సమావేశం నిర్వహించింది. కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధ్యక్షతన శనివారం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ల్యాండ్ లీగల్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎస్‌కె చెట్టి నేతృత్వంలోని రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ కీలక మౌలిక సదుపాయల ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన 42.20 ఎకరాల భూమి బదిలీ ప్రక్రియను వేగిరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రభావిత రక్షణ భూమికి బదులుగా సమాన విలువ గల భూమిని ఇవ్వాలని రక్షణ శాఖ అధికారులు కమిషనర్‌ను కోరారు.
ఈ ప్రాజెక్టులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ , చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించి, కనెక్టివిటీని పెంచుతాయని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. రక్షణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రత్యామ్నాయ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేయడంపై జీహెఎంసీ దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.