04-07-2025 12:06:24 AM
-‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కారం
-యువత ఆకాంక్ష, సాంస్కృతి వారసత్వానికి ఈ అవార్డు అంకితం
-ఘనా పార్లమెంట్‌లో భారత ప్రధాని ప్రసంగం
-భారతదేశం ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ లాంటిది
-ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగమవుతుంది
అక్రా,జూలై 3: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించింది. ఘనా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును మోదీకి బహుకరించారు. అనంతరం ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఘనాలో పర్యటించడం.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడం తనకు లభించిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఘనా చాటుతోందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని మోదీ అభివర్ణించారు. ఇక భారత్‌లో 2500 కు పైగా రాజకీయ పార్టీలున్నాయన్నారు. ఆఫ్రికా అభివృద్ధి దిశగా చేసే ప్రయాణంలో భారత్ తమ సహాయమందిస్తుందని పేర్కొన్నారు.
జీ20కి భారత్ సారథ్యం వహిస్తోన్న తరుణంలోనే ఆ గ్రూప్‌లో ఆఫ్రికా యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందడం ఆనందకరమని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ క్రమం వేగంగా మారుతోందన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు.
ఘనా పురస్కారం నాకు దక్కిన గౌరవం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తనకు అత్యున్నత పురస్కారం లభించడంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఘనా జాతీయ గౌరవం దక్కడం నాకు చాలా గర్వకారణం. ఇది భారత్ మధ్య ఉన్న బలమైన , చిరకాల సంబంధాలకు నిదర్శనం. 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నా. మన యువత ఆకాంక్ష, ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కృతిక వారసత్వం, భారత్, ఘనాల మధ్య ఉన్న సంబంధాలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.
పలు ద్వైపాక్షిక ఒప్పందాలు..
కాగా అంతకుముందు ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో దైపాక్షిక ఒప్పందాలపై ప్రధాని మోదీ చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషద తదితర రంగాలకు సంబంధించిన అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. అనంతరం 8 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి బయల్దేరి వెళ్లారు.
భారత అభివృద్ధికి 2047 లక్ష్యంగా: మోదీ
ఘనా పార్లమెంట్‌లో మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ, చర్చల ప్రాముఖ్యతను వివరించారు. భారత్‌లో 2500లకు పైగా రాజకీయ పార్టీలున్నాయని పేర్కొన్నారు. ఇది ప్రజల గౌరవానికి మద్దతు ఇవ్వడంతో పాటు మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు. ‘హమారే లియో లోక్‌తంత్ర సిస్టమ్ నహీ, సంస్కార్ హై’ (మాకు ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది మా సంస్కారం) అని వెల్లడించారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే విధంగా భారతదేశ విస్తారమైన వైవిధ్యాన్ని ప్రస్తావించారు.
దేశంలో వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. భారతదేశానికి వచ్చే అతిథులను ఎల్లప్పుడూ విశాల హృదయాలతో స్వాగతించడానికి ఇదొక కారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి భారతీయులు ఎక్కడికి వెళ్లినా సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతుందని మోదీ తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని తమ ప్రజలు సంకల్పంతో ఉన్నారన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం వేగంగా మారిపోయిందన్నారు. సాంకేతితకలో విప్లవం, గ్లోబల్ సౌత్‌లో ఎదుగుదల ఆ మార్పునకు దోహదం చేస్తున్నాయని తెలిపారు.