3 July, 2026 | 1:06 AM

ఫీజులు ఇస్తారా.. గద్దె దిగుతారా?

03-07-2026 12:00 AM
  1. కాలేజీల బంద్ చూసైనా కళ్లు తెరవాలి 
  2. లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇదే చివరి పాలన
  3. కావాలనే కోర్టు కేసులకు హాజరుకాని ప్రభుత్వం 
  4. బంద్ శాంపిల్.. బీసీల సత్తా పది రోజుల్లో చూపిస్తాం 
  5. 15న వేలాదిమంది చలో హైదరాబాద్ నిర్వహిస్తాం
  6. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం బీసీ జేఏసీ ఇచ్చిన కాలేజీల బంద్ వంద శాతం సంపూర్ణంగా విజయవంతం అయిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. వేలాది కాలేజీలు మూతపడ్డాయని, లక్షల మంది విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని చెప్పారు. కాలేజీల బంద్ చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి, బకాయిలు విడుదలచేయాలని డిమాండ్ చేశారు.

లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇదే చివరి పాలన అవుతుందని హెచ్చరించారు. శుక్రవారం కాలేజీల బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా వేలాది ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్య కాలేజీలు ఒకరోజు ముందుగానే సెలవులు ప్రకటించారు, కొన్ని చోట్ల తెరుచుకున్న కాలేజీలను బీసీ సంఘాల కార్యకర్తలు బందు చేయించారు.

హైదరాబాదులోని బర్కత్‌పురలో జరిగిన విద్యార్థుల ఆందోళనలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయాలనే కుట్రతోనే హైకోర్టులో కేసులకు అడ్వకేట్‌జనరల్ హాజరు కాకుండా, అఫిడబిట్ వేయకుండా ఉంటోందన్నారు. దీంతో హైకోర్టు విద్యార్థుల నుంచే కాలేజీలు ఫీజులు వసూలు చేయాలనే తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం అనుకున్న కోర్టు కేసుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించి కేసులు వాదిస్తున్నదన్నారు.

కానీ రీయింబర్స్‌మెంట్ కేసులో మాత్రం కనీసం అడ్వకేట్ జనరల్ కూడా హాజరు కాకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు బడ్జెట్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం దోచిపెడుతున్నది తప్ప పేద విద్యార్థుల ఫీజుల బకాయిల కోసం కనీసం 7వేలకోట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఉన్నది కాంట్రాక్టర్ల కోసమా.. పేద విద్యార్థుల కోసమా అని మండిపడ్డారు.

జరిగిన కాలేజీల బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక శాంపిల్ మాత్రమేనని, ప్రభుత్వం దిగివచ్చి ఫీజుల రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితో, జెన్ జీ ఆదర్శంతో ప్రభుత్వంపై విద్యార్థులు తిరగబడిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 14 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వం తగులుతుందని శాపించారు. తమ జాతికి ఇంత అన్యాయం జరుగుతున్న కనీసం నోరు మెదపని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 15న వేలాదిమంది చలో హైదరాబాద్‌కు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.

మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం పేద విద్యార్థులకు ఫీజులు ఇస్తరో, గద్దె దిగుతరో తేల్చుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. ఆందోళనలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీ య అధ్యక్షుడు కనుకల శ్యాం కుర్మా, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహనాయక్, మహిళా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తారకేశ్వరి, సమతా యాదవ్, నందగోపాల్, విజయ్ ఉన్నారు.