ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగా జీతాల చెల్లింపు
- ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
- ఇకపై ఉద్యోగులు, సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు తప్పనిసరి
- జవాబుదారీతనం పెంపోందించేందుకే ఈ విధానం
సికింద్రాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదును ఆధారంగా చేసుకుని మాత్రమే జీతాలు జమ చేయబడతాయని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రోజున తార్నాకలోని ఎంఎంసి ప్రధాన కార్యాలయం లో ఎస్‌ఎఫ్‌ఏలతో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు విధానం పరిధిలోకి రావాలని స్పష్టం చేశారు. పని సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు విధానం అమలు చేయబడుతోందని తెలిపారు.రెగ్యులర్ ఉద్యోగులు ఎవరూ ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానాన్ని వ్యతిరేకించరాదన్నారు.
శానిటేషన్ విభాగంలోని అన్ని రకాల రెగ్యులర్ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయడానికి అవసరమైన వివరాలను కార్పొరేషన్కు అందించాలని వివరించారు. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు ఆధారంగానే పర్య వేక్షించబడతాయని స్పష్టం చేశారు. ఎటువంటి అనధికారిక గైర్హాజరు జరిగినా దానిని తీవ్రమైన అంశంగా పరిగణించి, సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదును ఆధారంగా చేసుకుని మాత్రమే జీతాలు జమ చేయబడతాయని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి వివరించారు.






