calender_icon.png 9 January, 2026 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేత

08-01-2026 12:48:01 AM

  1. పోలీసులపైకి రాళ్లు రువ్విన స్థానికులు
  2. ఐదుగురు పోలీసులకు గాయాలు
  3. ఫైజ్- ఏ -ఇలాహీ మసీదు పరిసరాల్లో ఉద్రిక్తత
  4. ఐదుగురు వ్యక్తుల అరెస్ట్

న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీలోని తుర్మ్‌ఖాన్ గేట్ సమీపంలో గల ఫైజ్- -ఏ -ఇలాహీ మసీదు పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఆక్రమణలను తొలగించే క్రమంలో స్థానికులు భారీగా గుమిగూడి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఆకస్మిక దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడగా, పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.

శాంతిభద్రతల విఘాతానికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రాంలీలా మైదాన్ ఆనుకుని ఉన్న మసీదు, శ్మశాన వాటిక సమీపంలోని సుమారు వంద ఏళ్ల నాటి పాత నిర్మాణాలను తొలగించడానికి ఈ చర్యలు చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి కొందరు ఆందోళనకారులు బారికేడ్లను విరగ్గొట్టడానికి ప్రయత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్వల్పంగా గాయపడిన పోలీసు అధికారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి నేరాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు ఈ కూల్చివేతలపై న్యాయపోరాటం కూడా నడుస్తోంది.

మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. సదరు భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని, దానిపై తమకు లీజు హక్కులు ఉన్నాయని కమిటీ వాదిస్తోంది. గతేడాది నవంబర్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆపరేషన్ దృష్ట్యా పాత ఢిల్లీ వైపు వెళ్లే పలు రహదారులను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైకోర్టులో పిటిషన్ వేసిన ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’

ఈ వివాదానికి మూలం గతేడాది చోటుచేసుకున్న ఒక సంఘటనతో ముడిపడి ఉంది. 2025 నవంబర్ 10వ తేదీన ఎర్రకోట సమీపంలో జరిగిన కారుబాంబు పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడు ఉమర్ ఉన్ నబీ పేలుడుకు ముందు ఈ ఫైజ్- ఏ- ఇలాహీ మసీదును సందర్శించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ అనే సంస్థ మసీదు పరిసరాల్లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, అక్కడ అక్రమంగా వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయని హైకోర్టులో పిటిషన్ వేసింది.