calender_icon.png 10 January, 2026 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ ఉత్పత్తుల వైపు యువ రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

09-01-2026 08:40:32 PM

సేంద్రీయ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు 

కెవికె హెడ్ ఇంచార్జ్ డాక్టర్ డి నరేష్ 

గరిడేపల్లి,(విజయక్రాంతి): సేంద్రియ వ్యవసాయంపై యువ రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త,హెడ్ ఇన్చార్జ్ డాక్టర్ డి నరేష్ కోరారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో హైదరాబాదులోని రాజేంద్రనగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ మేనేజ్మెంట్ ఆర్థిక సహకారంతో షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతుల కోసం సేంద్రియ వ్యవసాయం సాగుపై 5 రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

ఈ సందర్భంగా జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులు సేంద్రియ వ్యవసాయం సాగు చేపట్టి దానిని యువ రైతులు కూడా సాగు చేసే విధంగా చైతన్యం తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి సేంద్రియ ఉత్పత్తుల వైపు యువ రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ రెట్టింపు ఆదాయం వచ్చే పంటలను ఎంచుకొని సాగు చేపట్టాలని కోరారు.

రసాయన ఎరువులు మోతాదుకు మించి వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని అంతేకాకుండా కాలుష్యానికి గురవుతుందని తెలిపారు.సేంద్రియ వ్యవసాయం చేపట్టడం ద్వారా భూమి ఆరోగ్యంతో పాటు మానవ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవచ్చని తెలిపారు. సేంద్రియ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని,రైతులతో పాటు యువత కూడా దీనిపై ఆసక్తి చూపాలని ఆయన కోరారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టడం ద్వారా పంట సాగు చేయడమే కాక ఆవు పేడ, మూత్రం ద్వారా సబ్బులు, షాంపూలు, అగరబత్తులు వంటి వివిధ ఉత్పత్తులను తయారు చేసుకుని అదనపు ఉపాధి పొందవచ్చునని రైతులకు వివరించారు.

అనంతరం కె వికి శాస్త్రవేత్త ఏ కిరణ్ మాట్లాడుతూ... కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతుల కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు విస్తరణ కార్యకలాపాలు, ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఐదు రోజుల శిక్షణలో రైతులు పొందిన అనుభవాలను ముగింపు సమావేశంలో పంచుకున్నారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ట్రైనింగ్ మాన్యువల్ కిట్, జీవన ఎరువులు, వేప నూనె, పప్పు పిండి, బెల్లం, వేస్ట్ డీకంపోజర్ తదితర సేంద్రీయ ఇన్ పుట్స్ ను రైతులకు పంపిణీ చేసి సర్టిఫికెట్లను అందజేశారు.