08-01-2026 01:06:49 AM
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): పెన్షనర్లు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. మార్చిలో పది రోజులపాటు ఢిల్లీ జంతర్ మంతర్‌లో దేశవ్యాప్తంగా పెన్షనర్లతో ధర్నా చేపడుతున్నట్లు, అందులో తెలంగాణ నుంచి పెన్షనర్లు సైతం పాల్గొంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ సభ నిర్వహించారు.
ముఖ్యఅతిథులుగా ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డీ సుధాకర్, ఆర్థిక కార్యదర్శి రాజేంద్రబాబు, తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఛైర్మన్ కే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ సుధాకర్, కే లక్ష్మయ్య మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నాను చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పెన్షనర్లకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పెండింగ్ డీఏలు, పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
2024 తర్వాత రిటైరైన పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలు సుమారు రూ. 8,500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 25వ తేదీన పెన్షనర్లకు నష్టం కలిగించే నల్లచట్టం తేవటాన్ని నిరసిస్తూ ఆ రోజు బ్లాక్ డేగా పాటించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించామని, కానీ అందుకు భిన్నంగా విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో కూడా అవిశ్రాంత పోరాటాలే మిగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు.
పెన్షనర్లు వయోభారం లెక్కచేయకుండా రోడ్లెక్కుతున్న పరిస్థితి తలెత్తిందన్నారు. కనీసం హెల్త్ కార్డుల్లేక చాలా మంది అనారోగ్యంతో ఇబ్బందుల పాలయ్యారని, సుమారు 42 మంది పెన్షన్ బకాయిలు చేతికందకుండానే అర్ధాంతరంగా చనిపోయారని, మరికొందరు అంపశయ్యపై కొన ఊపిరితో పోరాడుతున్నారని ఆదేవదన వ్యక్తంచేశారు.
ఈ జనవరి నెలతో కలుపుకుంటే ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ వేసి మూడు సంవత్సరాలు పూర్తికావస్తున్నా నూతన పీఆర్సీ ముచ్చటే లేదని పేర్కొన్నారు. తక్షణమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పెండింగ్ డీఏలు ప్రకటిస్తూ సంక్రాంతి కానుకగా నూతన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు పెన్షనర్స్ డైరెక్టరేట్ ప్రకటించాలని వారు ఒక ప్రకటనలో కోరారు.
పెన్షనర్ల డిమాండ్లు ఇవి..
1. 2024 తర్వాత రిటైరైన పెన్షన్లకు పెండింగ్ బకాయి బిల్లులు విడుదల చేయాలి
2. పెన్షనర్ల సమస్యలు తక్షణ పరిష్కారానికి పెన్షనర్ల ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలి
3. తక్షణమే ప్రభుత్వం అన్నీ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై వైద్యం అందించాలి
4. 398 స్పెషల్ టీచర్లకూ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి
5. అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా తక్షణమే పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ 01-07-2023 నుంచి నూతన పీఆర్సీ ప్రకటించాలి