08-01-2026 12:46:22 AM
పొత్తులను అంగీకరించబోం: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
12 మంది కౌన్సిలర్లు, బ్లాక్ ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
ముంబై, జనవరి 7 : మహారాష్ట్ర రాజకీయాల్లో మహా అధికార టిస్ట్.. అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల అనంతరం పాలిటిక్స్‌లో అత్యంత అరుదైన, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికారమే పరమావధిగా మేయర్ పీఠమే లక్ష్యంగా బద్ధ శత్రువులైన భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ పార్టీలు స్థానికంగా చేతులు కలిపాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
కాంగ్రెస్, ఎంఐఎంతో పొత్తులను ఎట్టిపరిస్థితుల్లో అంగీక రించబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆగ్రహిస్తూ.. 12 మంది కౌన్సిలర్లు, బ్లాక్ ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పొత్తు చిచ్చు పెనుసంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ఆ రెండు పార్టీల ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ప్రతిపక్ష నేత సంజయ్ రౌత్ విమర్శించారు.
అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌కు గతేడాది డిసెంబర్ 20న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
అంబర్‌నాథ్‌లోని మొత్తం 60 సీట్లలో శివసేన 27 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కేవలం నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. మరోవైపు బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారం దక్కించుకోవడానికి ఈ రెండు పార్టీలు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి ‘అంబర్నాథ్ వికాస్ అఘాడీ’ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో శివసేనను అధికారం నుంచి దూరంగా ఉంచడానికి ప్రత్యర్థి పార్టీలు ఏకమై 31 మంది సభ్యుల బలంతో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఈ పరిణామంతో మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఒంటరిగా మిగిలిపోయింది. మేయర్‌గా బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే పాటిల్ ఎన్నిక కాగా శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్ ఓటమి పాలయ్యారు.
పొత్తులను రద్దు చేయాలి : ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
ఈ వింత పొత్తుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేదా ఎంఐఎం వంటి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. స్థానిక నేతలు క్రమశిక్షణ ఉల్లంఘించి తీసుకున్న ఇటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబర్‌నాథ్‌తో పాటు అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో కూడా బీజేపీ స్థానిక నేతలు ఎంఐఎంతో చేతులు కలపడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ఈ పొత్తులను రద్దు చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
చర్యలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించింది. తమ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న అంబర్‌నాథ్ మున్సిపల్‌కు చెందిన 12 మంది కౌన్సిలర్లను, బ్లాక్ ప్రెసిడెంట్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా స్థానిక నేతలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ వివరణ ఇచ్చారు. అటు శివసేన నేతలు కూడా బీజేపీ చర్యను ‘ద్రోహం’గా అభివర్ణిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదించే బీజేపీ, అధికారం కోసం అదే పార్టీతో చేతులు కలపడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ప్రతిపక్ష నేత సంజయ్ రౌత్ విమర్శించారు.