23-07-2025 07:13:13 PM
హైదరాబాద్: ఎంజీబీఎస్ లో జరిగిన ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాల పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti vikramarka) మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం(Telangana Mahalakshmi Scheme) ద్వారా ఇప్పటివరకు మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేసి, రూ. 6,680 కోట్లు ఆదా చేసుకున్నారు. ఉచిత ప్రయాణాల వలన ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 97శాతానికి పెరిగిందని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీ బస్సులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 3,000 బ్యాటరీ బస్సులు ఆర్డర్ చేసాం, మరో 500 బస్సులకు ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ప్రయోజనం మాత్రమే కాకుండా ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. వడ్డీ లేని రుణాల ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, ఆ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇచ్చే అవకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. గత నెలలో కోటికి పైగా రుణాల చెక్కులను బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇప్పటివరకు 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేశామని వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో రూ. 20 వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టబోతున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.