calender_icon.png 25 July, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పునరుద్ధరణ జరగకపోతే జైలుకే

24-07-2025 01:28:16 AM

  1. జాగ్రత్త.. అక్కడే జైల్లో పెట్టాల్సి వస్తుంది 
  2. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు మరోసారి ఘాటైన హెచ్చరిక 
  3. తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 23 (విజయక్రాంతి) : ‘జాగ్రత్త.. అక్కడే జైల్లో పెట్టాల్సి వస్తుంది.. అడవిని కాపాడకపోతే అధికారులను అక్కడికక్కడే తాత్కా లిక జైళ్లను ఏర్పాటుచేసి, అందులోకి పం పాల్సి ఉంటుంది. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి జరగాల్సిందే, అందుకు నేను వ్యతిరేకం కాదు’ అని కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు

. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన పర్యావరణ వివాదం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులకు జైలు తప్పదని అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

విచారణలో భాగంగా..

కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావర ణ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలతో తగిన చర్యలు తీసుకున్నామని, ఈ భూముల్లో ప్రస్తుతం ఎలాంటి పనులు చేపట్టడం లేదని, పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించేందుకు అమికస్ క్యూరీ సమయం కోరారు.

దీంతో తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం ఆగస్టు 13కు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ -చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేసింది.

ఈ అంశంపై గత మే, ఏప్రిల్ నెలల్లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే చీఫ్ సెక్రటరీ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదావేస్తూ వస్తోంది.

విచారణ ప్రారంభంలోనే వివరాలను పరిశీలించిన సీజేఐ, చెట్లు తొలగించేందుకు ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు.

ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం 20 ట్రాప్ కెమెరాలు అమర్చి, 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.