24-07-2025 01:20:22 AM
వంద శాతం దానిని సాధించి తీరుతాం
రిజర్వేషన్లతో కాంగ్రెస్ పార్టీ బీసీల గుండెల్లో నిలుస్తుంది
బీసీ రిజర్వేషన్ బీజేపీవాళ్లకు ఇష్టం లేదు
కొందరికీ అడగకున్నా రిజర్వేషన్లు ఇచ్చారు..
పోరాడుతున్న బీసీలను పట్టించుకోవడం లేదు
ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో బీఆర్‌ఎస్
షెడ్యూల్ 9లో చేర్చితేనే రిజర్వేషన్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు అవకాశం
ఈడబ్ల్యూఎస్ సాధ్యమైనప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకు కాదు?
‘విజయక్రాంతి’ స్పెషల్ ఇంటర్వ్యూలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకు న్న కులగణన, బీసీల రిజర్వేషన్ బిల్లుతో జాతీయస్థాయిలో చలనం వచ్చింది. ఎంతోకాలంగా బీసీలంతా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ అంశం త్వరలోనే ఒక కొలిక్కి రానున్నది.
అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ రిజర్వేషన్ అంశం చేర్చి, ప్రభుత్వంలోకి రాగానే ఆ దిశగా చర్యలు చేపట్టడం వెనుక ఎందరో బీసీ నాయకుల కృషి ఉన్నది. అందులో బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కీలకపాత్ర పోషించారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా బీసీ సమాజాన్ని ఏకం చేయడంలో, వారిని చైతన్యపరిచి లక్ష్యం వైపుగా నడిపించడంలో టీ చిరంజీవులు ముందు నిలబడ్డారు.
బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి స్థితిగతులు మారేందుకు ఒక అడుగు దూరం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీల రాజ్యాధికారమే తమ ప్రధాన లక్ష్యమని, దానిని వంద శాతం సాధించి తీరుతామని అంటున్న టీ చిరంజీవులతో ‘విజయక్రాంతి’ స్పెషల్ ఇంటర్వ్యూ..
‘మేమున్నదే రాజ్యాధికారం సాధించుకోవడం కోసం. ప్రస్తుతం ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నాం. 42 శాతం రిజర్వేషన్ అమలైతే, ఓపెన్‌లో 8 శాతం వరకు బీసీలు వస్తారు. మొత్తం 50 శాతం బీసీలే ఉంటారు. ప్రభుత్వంలో సగం మేమే. ఎస్సీ, ఎస్టీలను కలుపుకుంటే ఒక ఫోర్స్‌గా తయారవుతాం.
బీసీలకు రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యం. వంద శాతం దానిని సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకదాని తర్వాత ఒక్కటిగా పరిష్కరించుకుంటాం’ అని చిరంజీవులు స్పష్టం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశంపై అనేక అంశాలు ఆయన మాటల్లోనే..
బీసీల హృదయాల్లో కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది సంతోషం. 42 శాతం రిజర్వేషన్‌పై బిల్లు పెట్టారు..రాష్ట్రపతికి పంపారు. కానీ అది ఆమోదం పొందకపోతే చేసిందంతా వృథానే. సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పట్ల తమ చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు రెండు అడుగులు ముందుకు వేసింది. క్లిష్టమైన మూడో అడుగు కూడా పూర్తి చేస్తే వంద శాతం కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి బీసీల హృదయాల్లో నిలిచిపోతారు. అందుకే ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని కోరుతున్నాం.
రాహుల్, మోదీలను కలవడం శుభపరిణామమే..
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కులగణన చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ అంశాల్లో రిజర్వేషన్ పెంచుతూ బిల్లు చేసి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించారు. కానీ బిల్లు పంపించి మూడు నెలలు గడుస్తున్నా ఢిల్లీలో బీసీ సంఘం ధర్నాకు హాజరయ్యారు తప్పా అంతకుమించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని, ప్రధాని, రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం పొందేలా చూడాలని మేం కూడా చాలా సార్లు అడిగాం. అయినా పట్టించుకోలేదు. హైకోర్టు మాత్రం మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి, దాని ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది విజయ వంతం కాదని నా అభిప్రాయం. దీనికి సంబంధించి గతంలో అనేక అనుభవాలున్నాయి.
మేము మొదటి నుంచి రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని కోరుతున్నాం. అప్పుడే రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. కోర్టుల్లో సమీక్షించే అవకాశం ఉండదని చెబుతున్నాం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో సహా ప్రధాన మంత్రిని కలుస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక శుభ పరిణామం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో రిజర్వేషన్ అంశాన్ని పూర్తి చేయాలి. ఆగస్టు 5, 6వ తేదీల్లో మేం కూడా సమావేశం నిర్వహించబోతున్నాం.
కాలికేస్తే వేలికి.. వేలికేస్తే కాలికి..
బీజేపీ వాళ్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సుతారం ఇష్టం లేదు. మొదటి నుంచి కాలికి వేస్తే వేలికి..వేలికేస్తే కాలికి వేస్తున్నారు. ఫస్ట్ కులగణన అసాధ్యం, దేశవ్యాప్త కులగణన చేయబోమని చెప్పారు. ప్రజాభిప్రాయానికి లొంగి చేస్తున్నారు. బీసీలందరూ షెడ్యూల్ 9 గురించి మాట్లాడుతుంటే బీజేపీ వాళ్లేమో ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తీసేస్తే ఒక్కరోజులో తీసుకొస్తామంటున్నారు.
మండల్ కమిషన్ రిపోర్ట్‌లోనే 52 శాతం బీసీ జనాభాలో 8.4 శాతం ముస్లిం జనాభా ఉంది. ప్రస్తుతం చాలా ఉత్తర భారత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో కూడా జనరల్ కోటా కింద ముస్లింలు అర్హులే. అలాంటప్పుడు ముస్లింల అంశాన్ని అడ్డం పెట్టుకుని అభ్యంతరాలు తెలపడం సరికాదు. షెడ్యూల్ 9లో పెట్టడం అసాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. దానిని తీవ్రంగా ఖండించాం.
తమిళనాడు తరహాలో షెడ్యూల్ 9లో చేర్చుకుని గత 31 ఏళ్లుగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తుందో ఇక్కడ కూడా అదే మాదిరి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. బీజేపీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అమలు చేసినప్పుడు ఎవరినీ అడగకుండా, ఎలాంటి చర్చ లేకుండా, ఎవరు ధర్నా చేయకున్నా, ఏదో పాత రిపోర్టు తీసి 10 శాతం వరకు పెంచుతూ రిజర్వేషన్ బిల్లును వారం రోజుల్లోనే పాస్ చేశారు.
2019 జనవరి 7న క్యాబినెట్ మీటింగ్, 8న లోక్‌సభ, 9న రాజ్యసభ, 12న రాష్ట్రపతి ఆమోదం, అదే రోజున గెజిట్ నోటిఫికేషన్, 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ను వారంలో పూర్తి చేసినా బీజేపీ బీసీ బిల్లు తీసుకొచ్చి మూడు నెలలు అయినా ఇప్పటికీ కేంద్ర క్యాబినెట్‌లో చర్చించలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లవని 1992లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
అయినా వారంలోనే 103వ రాజ్యాంగ సవరణ చేసి, ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో చేర్పించి, ఆ తర్వాత ఐదుగురు జడ్జీల బెంచ్ ముగ్గురితో ఒప్పించారు. దీనిపై దేశంలో ఏ కోర్టులో కూడా స్టే ఇవ్వలేదు. కానీ బీసీ అంశంలో మాత్రం మండల్ కమిషన్ రెండేళ్లు స్టేలో ఉండిపోయింది. మండల్ కమిషన్ కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల సిఫార్సు చేసింది. విద్యలో రిజర్వేషన్ల కోసం 2006లో రాజ్యాంగ సవరణ చేసి యాక్టు తీసుకొస్తే దానిపై కూడా కోర్టు స్టే ఇచ్చింది. రెండేళ్ల తర్వాత విద్యలో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తీర్పు ఇచ్చింది.
ఈడబ్ల్యూఎస్‌కు దేశంలో ఏ కోర్టు స్టే ఇవ్వదు. కానీ బీసీలకు మాత్రం అన్ని స్టేలు ఇస్తారు. తెలంగాణలో 4 శాతం లేని ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. దీంతో బీసీలు అవకాశాలు కోల్పోతున్నారు. బీజేపీ వాళ్లు వడ్డించాలనుకునే వారికి అడగకున్నా పెట్టారు. బీసీలు ఇంతగా పోరాడుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు. బీసీలు ఏం అన్యాయం చేశారు. తమిళనాడులో ఎలా అమలవుతున్నది. తమిళనాడుకు భారత రాజ్యాంగం వర్తించదా?.. వారు భారతదేశంలో అంతర్భాగం కాదా?.
బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు..
బీఆర్‌ఎస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఏ స్టాండ్ తీసుకోవాలో సందిగ్ధంలో ఉంది. బీసీ ప్రజా ప్రతినిధుల సంఘం అని కొద్ది మంది లీడర్లు మాట్లాడారు. కానీ ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం తమ వైఖరి ఇది అని ప్రకటించలేదు. బీఆర్‌ఎస్ పాలనలోనే 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారు. కనీసం పార్టీ పరంగా కూడా బీసీలకు రిజర్వేషన్ డిక్లేర్ చేయలేదు. ఆ పార్టీ అగ్ర నాయకులు కులగణనలో కూడా పాల్గొనలేదు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంలో బీసీలకు 41 శాతం రిజర్వేషన్ పెంచేందుకు అవకాశం ఉన్నా చేయలేదు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎస్సీలకు 8 శాతం, ఎస్టీలకు 1 శాతం ఇచ్చారు. వారికి మొత్తం 9 శాతం పోయినా మిగిలిన 41 శాతం బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా 33 శాతం ఇచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఓసీలకు 59 శాతం ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీకి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. పార్టీలన్నీ బీసీలను మభ్యపెట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి.
షెడ్యూల్ 9తోనే బీసీ రిజర్వేషన్‌కు రక్షణ..
వంద శాతం షెడ్యూల్ 9లో చేర్చితేనే కోర్టుల్లో వేసే సవాళ్లకు ఎదుర్కొని బీసీల రిజర్వేషన్ అంశం నిలుస్తుంది. షెడ్యూల్ 9 లో చేర్చినా కోర్టులో సమీక్ష చేయవచ్చనే వాదన కూడా వినపడుతుంది. తమిళనాడు 1994లో బీసీ రిజర్వేషన్ల అంశం షెడ్యూల్ 9లో చేర్చారు. 31 ఏళ్లుగా అక్కడి బీసీలు రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తున్నారు. షెడ్యూల్ 9లో ఇప్పటివరకు 284 చట్టాలను ఇప్పటివరకు పెట్టారు.
ఒక్క కేసు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిన దాఖలాలు లేవు. షెడ్యూల్ 9లో పెట్టినా సమీక్ష చేస్తామని, ఆ అంశాలు రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే కొట్టేస్తామని 2007లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమా, 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే రాజ్యాంగ స్వరూపాన్ని దెబ్బతీస్తుందా అనే అంశాలపై 2022 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీర్పు సందర్భంగా చర్చ జరిపారు.
ఈ రెండు అంశాలు రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకం కావు. రిజర్వేషన్ అంశం రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టే స్పష్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ పరమైన సమీక్షకు ఆస్కారం ఎందుకు ఉంటుంది. అందుకే షెడ్యూల్ 9 లో పెడితే దీనికి రక్షణ ఉంటుంది.
ఆర్డినెన్స్‌కు, జీవోకు తేడా ఏమీ లేదు..
ఆర్డినెన్స్‌కు జీవోకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. అసెంబ్లీ సెషన్స్ లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి గవర్నర్ సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ నిర్వహించి దానికి చట్టరూపం తీసుకురావాల్సి ఉంటుంది. అంతకుమించి ఆర్డినెన్స్‌తో పని ఏమీ లేదు. వీరు అసెంబ్లీని ప్రోరోగ్ చేసి..మళ్లీ ఆర్డినెన్స్ ఇచ్చి గవర్నర్ సంతకానికి పంపించి కూడా వారం రోజులైంది.
దానికి బదులు అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా అలాగే కొనసాగించి జీవో ఇవ్వొచ్చు. ఉదాహరణకు తెలంగాణలో 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని చేశారు. అందులో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారు. దానిని అమలు చేయడానికి జీవో 396 ఇచ్చారు. దీనిపై ఒకరు కోర్టుకు వెళ్లారు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసులో ట్రిపుల్ టెస్ట్ ఉంది.. 50 శాతం దాటకూడదని ఉంది.
కానీ మీరు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్‌తో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం తో కలిపితే అది 62 శాతం వరకు పోతుంది. అందుకే దానిని కోర్టు కొట్టేసింది. తర్వాత ఆర్డినెన్స్ 2 ద్వారా 23 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టంలోకి తీసుకురావడానికి సెక్షన్ 285 చేర్చారు. ఇప్పుడు ఆ సెక్షన్ తీసేసి ఆర్డినెన్స్ ఇవ్వక తప్పడం లేదంటున్నా రు.
మహారాష్ట్ర తరహాలో..
ఆర్డినెన్స్ తర్వాత జీవో వస్తుంది. జీవో ఇచ్చిన తర్వాత కోర్టులో సవాల్ చేస్తారు. అపుడు రిజర్వేషన్ 50 శాతం దాటి పోతుంది కాబట్టి కోర్టు కొట్టేస్తుంది. అయితే ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని, ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవని భావిస్తోంది. వాస్తవానికి పక్కన మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పుడు రెండేళ్లు పదవీలో కొనసాగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని ముందుకెళ్తే మహారాష్ట్ర పరిస్థితి పునరావృతం అవుతుంది.
కేంద్రం ఒప్పుకోకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు..
సెప్టెంబర్ 30వ తేదీ గడువు ఏమీ శిలా శాసనం కాదు. కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉంది.. అది పాస్ అయ్యే అవకాశం ఉందని, కొంచెం సమయం ఇవ్వాలని కోర్టును కోరితే పొడగించే అవకాశం ఉంటుంది. అయితే వారంలో ఈడబ్ల్యూఎస్ సాధ్యం అయినప్పుడు రెండు నెలల్లో ఎందుకు సాధ్యం కాదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించే పనిలో ఉంది. ఒప్పుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.
కేంద్రం ఒప్పుకోకపోతే బీసీల ద్రోహులెవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలే ప్రజాక్షేత్రంలో తీర్పు ఇస్తారు. కేంద్రం ఒప్పుకుని చట్టసవరణ చేసి, షెడ్యూల్ 9లో చేర్చితే ఆర్డినెన్స్ అవసరమే ఉండదు. షెడ్యూల్ 9లో పెట్టినా జీవో ఇవ్వాల్సిందే. అప్పుడు ఆ అంశాన్ని కోర్టులు సమీక్షించవు. అభ్యంతరం చెప్పవు. అప్పుడు బీసీ రిజర్వేషన్‌పై ప్రశ్నించడానికి ఆస్కారం ఉండదు.
రిజర్వేషన్ అమలైతేనే బీసీల సహకారం..
42 శాతం రిజర్వేషన్ అమలైతే కాంగ్రెస్‌కు, సహకరిస్తే బీజేపీకి తెలంగాణలో మద్దతు పెరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ అంశంతోపాటు అనేక సమస్యలున్నాయి. రిజర్వేషన్ల అంశం తర్వాత మిగిలిన వా టిపై దృష్టి సారిస్తాం. బీసీలకు సబ్‌ప్లాన్ ఇస్తామన్నా రు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒ కేంద్రంలో కూ డా చట్టసభల్లో మూడో వంతు ప్రాతినిధ్యం ఇవ్వాలి. మహిళలకు ఇవ్వాలి. వాటిపై పోరాటం చేస్తాం.
కేంద్రం చేతులెత్తేస్తే భవిష్యత్ కార్యాచరణ ..
కేంద్రం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబోమని చేతులెత్తేస్తే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే సమస్య వస్తుంది. అప్పుడు బీసీ సంఘాలు అన్ని కూర్చొని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. వా ళ్లు చేయాలనుకుంటే కోర్టు పెట్టిన గడువులోపే సాధ్యమవుతుంది. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అంగీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఎన్నికల నిర్వహణకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరితే కోర్టు తప్పకుండా చేస్తుంది.
బీసీలు లేకపోతే మనుగడే లేదు..
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీసీ ఉద్యమం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల మంత్రం జపించకుంటే వారి మనుగడే లేదనేది అందరికీ అర్థమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక్కరు కూడా ఓసీ లేరు. ఎమ్మెల్సీ కేటాయింపులో కూడా ఒక్క ఓసీ లేరు. బీసీలు కూడా ఆర్గనైజ్ అవుతున్నారు. 77 ఏళ్లుగా నష్టపోయాం, ఇలాగే ఉంటే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉందని బీసీలను చైతన్యం చేస్తున్నాం.
అంబేద్కర్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీల రాజకీయ పార్టీలు వచ్చే అవకాశం ఉంది. వెంటనే కాకపోయినా బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఒక ప్రణాళికా బద్ధంగా వెళ్తున్నాం. బీసీ వాదం గ్రామాల స్థాయికి కూడా వ్యాపించింది. గతంలో అర్బన్ ఏరియాలోనే ఉండేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తోంది. బీసీల సమస్యలను గడపగడపకు చేరేలా చేస్తాం.