24-07-2025 12:58:26 AM
న్యూఢిల్లీ, జూలై 23: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఆ పదవిని చేపట్టబోయే వారు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామ ని.. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నట్టు ఈసీ పేర్కొంది.
త్వరలోనే రిటర్నింగ్ అధికారుల పేర్లు కూడా ఖరారు చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ కాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. రాబోయే 72 గంటల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని పేర్కొంది.
అయితే ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా పదవి రేసులో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం?
పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకూ ఓటు హక్కు ఉంది. లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది ఉండగా.. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయసభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తం గా 422 మంది సభ్యులు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు.
రేసులో పలువురు నేతలు..
తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. అధికార ఎన్డీయే కూటమి పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు.
అయితే అనూహ్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. వీరితో పాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల్లో ఒకరికి అవకాశమివ్వొచ్చని ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పదవి చేపట్టబోయేది ఎవరన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.