calender_icon.png 24 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ కుర్చీ కోసం పల్లెకు..

24-07-2025 12:24:33 AM

- పట్టణాలు వీడి గ్రామాల బాట పట్టిన నేతలు..

- గ్రామ రాజకీయాల వైపు యువత చూపు...

- ఖర్చు ఎంతైనా సరే సర్పంచ్ గిరి మిస్ కానివ్వద్దు..

ఆదిలాబాద్, జూలై 23 (విజయ క్రాంతి):  తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. స్థానిక పోరుకు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు పడుతొంది. తాజాగా ఎన్నికలు నిర్వహించే వార్డులు, గ్రామాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయడంతో క్షేత్రస్థాయిలో రాజకీయం వేడెక్కుతోంది.

రాష్ట్రంలో 566 జడ్పీటీసీ స్థానా లు, 5,773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,694 వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల అమలు కు పంచాయతీ రాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 285(ఏ) లో సవరణ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం ఇప్పటికే ఆర్డినెన్స్ ముసాయిదాను పంపింది. గవర్నర్ దగ్గరి నుండి ఆర్డినెన్స్ రావడమే తరువాయి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో ముందుకెళుతుంది. 

గ్రామాల బాట పట్టిన నేతలు..

ఎన్నికల నిర్వహణకై ప్రభుత్వ అడుగులకు తగ్గట్టుగానే ఎన్నికల రంగంలోకి దిగి తమ అదృష్టం ను పరీక్షించుకునేందుకు స్థానిక నాయకులు, ఔత్సాహికులు, ముఖ్యంగా యువత సిద్ధమవుతున్నారు. ఎవరికివారు తమ వ్యూహాలకు పదును పెడుతు, పట్టణాల్లో ఉన్న నాయకులు గ్రామాల బాట పట్టారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇన్నాళ్లు ప్రజలతో అంటి ముట్టనట్లు ఉన్నవారు సైతం ఒక్కసారిగా గ్రామాల్లో  కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా వాళ్ళ దగ్గరకే వెళ్లి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తూ వారి ఆశీస్సులను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ వారి నుండి మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు సైతం ఆయా పార్టీల మద్దతును పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రామ రాజకీయల వైపు యువత చూపు....

ఒక్కప్పుడు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. ఉన్న త చదువులు చదివి ఉద్యోగాలు రాకనో, సమాజంలో ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫ్యాన్స్ పాలోయింగో, రాజకీయాల్లో ఉంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకంతో కొంద రు, డబ్బు సంపాదనతో పాటు సమాజంలో పరపతి పెరుగుతుందని మరికొందరు, బ్రష్టు పట్టిన రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించాలని మరి కొంతమంది ఇలా యువత రాజకీయల వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీ పదవు లను అధిష్టించిన వారిలో చాలా మంది స్థానిక సంస్థల నుండే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినవారే కావడం కూడా యువత స్థానిక సంస్థల ఎన్నికల వైపు చూడడానికి కారణంగా చెప్పవచ్చు.

గ్రామంలో, మండలంలో తమ పట్టును పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీలోనైనా నేతగా ఎదిగే ఆస్కారం ఉండటంతో మొదట స్థానిక పదవుల్లో నెగ్గేందుకు చాలా మంది యువత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ పదవిపై దృష్టి పెడుతున్నారు. లక్షలు ఖ్చన అయిన పర్వాలేదు కానీ టార్గెట్ సర్పంచ్ గిరి మిస్ కావద్దనే పట్టుదలతో రాజకీయ అరంగేట్రం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలు పేర్లతో సొసైటీ లను ఏర్పాటు చేసుకొని సామాజిక కార్యక్రమాలను చేపడుతూ  తాము సొంతంగా క్రియేట్ చేసుకున్న సోషల్ మీడియా గ్రూప్ ల్లో వాటిని తెగ వైరల్ చేసుకుంటున్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో యువత రాజకీయల వైపు ఆసక్తి చూపుతుండడం శుభ పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈసారి గట్టి పోటీ తప్పదా....

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి చోట గట్టి పోటీ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు ఆశావహులు ముందుకు రావడంతో ప్రధాన రాజ కీయ పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ లకు స్థానిక పోరు తలనొప్పిగా మారేలా ఉందనే భావన ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో అంతట త్రిముఖ పోరు తప్పదనే భావన సర్వత్రా వినబడుతుంది. ఇప్పటికే పలువురు ఆశావహులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తాను సర్పంచ్ ఎన్నికలలో పోటి చేస్తున్నాని పార్టీ మద్దతు తనకే లభించేలా చూడాలని కోరుతున్నారు.