24-07-2025 01:23:36 AM
హైదరాబాద్, జులై 23 (విజయక్రాంతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీఫైనల్ లాంటివని, అందుకే వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తే అధికారులు అందరూ సెట్ రైట్ అవుతారని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిస్తే ఏ అధికారి వేధించరని, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అంతులేని వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని కేటీఆర్ చెప్పారు.
ఆరు గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ పార్టీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మీసేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను జారీచేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభల్లో గప్పాలు కొట్టుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. వికారాబాద్‌కు చెందిన పలు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సీఎం, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు 6.5లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చామన్నారు.
ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 90వేల కార్డులు ఇచ్చామని, అయితే ఈ పనులు అన్నింటిని ఏవో ఘనకార్యాలుగా మేము ఎన్నడు భావించలేదన్నారు. రాహుల్ గాంధీ ఫోటోతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. రాష్ర్టంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని, బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లోనే కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టడం సిగ్గుచేటన్నారు.
అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్‌ఎస్‌దే అవుతుందన్నారు. నాడు ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం వాస్తవమని, రేపు అధికారంలోకి వచ్చాక గతంలో చేసిన తప్పును పునరావృత్తం చేయమన్నారు.
అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గం కాంగ్రెస్ చేతిలో మోస పోయిందన్నారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని, ఆయనకు పాలన చేతగాక సమర్థత లేక రాష్ర్ట ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మండిపడ్డారు.
చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను చూడాలని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఎవరు గుర్రాలో, ఎవరు గాడిదలో ప్రజలకు అర్థం అయిందని కేటీఆర్ అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.