20-05-2025 05:35:37 PM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం(Indira Saura Giri Jala Vikasam) ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల రైతుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఐటిడిఏ ఏటూరు నాగారం ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ విశాల్ తో కలిసి ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో ట్రైబల్ వెల్ఫేర్, అటవీశాఖ, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, విద్యుత్, రేడ్కో, రెవెన్యూ శాఖల సమన్వయంతో అర్హులైన గిరిజన రైతులకు పథకం వర్తింపజేసేందుకు కృషి చేయాలన్నారు.
ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి ఆసక్తి గల గిరిజన రైతులకు పథకాన్ని వివరించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టేదారులను గుర్తించి, మండల స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసి భూగర్భజల సర్వే నిర్వహించి, బోరు బావులు వేయించి సోలార్ సిస్టం ద్వారా మోటార్లు ఏర్పాటుచేసి, డ్రిప్ విధానం ద్వారా హార్టికల్చర్, వ్యవసాయ శాఖ ద్వారా పంటల సాగుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా మాట్లాడుతూ... ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం, గంగారం, గార్ల, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, కురవి, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో ప్రత్యేక గ్రామసభల ద్వారా ఆసక్తిగల రైతులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు మధుసూదన్ రాజ్, పురుషోత్తం, దేశి రామ్, సురేష్, నరేష్, మరియన్న, రాజ్ కుమార్, వెంకన్న, వీరభద్రం, ప్రభాకర్ పాల్గొన్నారు.