20-05-2025 09:02:12 PM
హనుమకొండ (విజయక్రాంతి): మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది కమల్ చంద్ర భంజ్ దేవ్ కి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన పోచమ్మ మైదాన్ సెంటర్లోని మహారాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఖిలా వరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలోని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్ముఖ శివలింగానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం వేయి స్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం రెడ్డిపురంలోని టార్చ్ సంస్థ వ్యవస్థాపకులు అరవింద్ ఆర్య ఇంటిని సందర్శించారు.
మీట్, గ్రీట్ కార్యక్రమ నిర్వహణ..
నక్కలగుట్ట లోని హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్లో ఓరుగల్లు నగర ప్రజలతో మీట్, గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మహారాజును పలు విషయాలపై వారితో చర్చించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని కోరారు. ప్రపంచానికి విజ్ఞానాన్ని, సాంప్రదాయాలను, సంస్కృతిని పరిచయం చేసిన మహోన్నత దేశం భారతదేశం అని అన్నారు. ప్రపంచ దేశాలకు భాష లిపి లేనప్పుడే మనం భాషను, లిపిని ఉపయోగించామని తెలిపారు. ఓరుగల్లులో నిర్మించనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ ని కోరినట్టు తెలిపారు.
కాకతీయుల సంపద అయిన కోహినూరు వజ్రాన్ని సైతం బ్రిటన్ నుంచి తెప్పించే ప్రయత్నం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. భారతదేశ, తెలంగాణ పురాతన కట్టడాలను, వారసత్వ సంపదలను పరిరక్షించి భావితరాలకు అందించాలని కోరానని వివరించారు. వారసత్వ సంపదను, మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని అన్నారు. భావితరాలకు మన సంస్కృతిని, సాంప్రదాయాలను, వారసత్వ సంపదను, చారిత్రాత్మక కట్టడాలను, దేశ చరిత్ర గురించి తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. మన ఆచార వ్యవహారాలను మనమే కాపాడుకోవాల్సి ఉంటుందని అన్నారు. బస్తర్ దసరా పండుగను 72 రోజులపాటు నిర్వహిస్తామని అన్నారు.