20-05-2025 08:40:03 PM
మోడీ మెడలు వంచేంతవరకు ఉద్యమాలు ఆగవు..
రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం..
మునుగోడు (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలతో మోడీ మెడలు వంచుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు.
రైతాంగం కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు.ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు,సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాల కోసం భేరసారాల హక్కు కోల్పోతారన్నారు. పనిగంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఆశ వివోఏ మధ్యాహ్న భోజనం అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, అసంఘటితరంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్, రైతు సంఘం మండల కార్యదర్శి వేముల లింగస్వామి, గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ మండల అధ్యక్షుడు లింగయ్య, వేముల విజయ్, ఎర్ర అరుణ, పెరమళ్ళ రాజు, నూకల పెద్దమ్మ, యాదమ్మ, దుర్గయ్య, పావని, సరిత, సంపూర్ణ, లలిత, మంగమ్మ, రమేష్ ఉన్నారు.