23-09-2025 07:29:29 PM
సుమారు గంట పాటు మెదక్ చేగుంట రహదారిపై ధర్నా
ఆలయం చుట్టూ అడ్డుగోడలు పెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసిన యువత
చిన్నశంకరంపేట/చేగుంట: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయం వద్ద, గ్రామ కంఠం భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని ఆరోపిస్తూ, గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం చేగుంట మెదక్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆలయం ముందు 25 గుంటల భూమిని కబ్జా చేసి జేసిబితో కందకాలు తీసి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టడంపై యువత అభ్యంతరం వ్యక్తం చేసి ఆలయం వద్దకు వెళ్లి పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆలయ భూములను రక్షించాలని సుమారు గంటపాటు రాస్తారోకో ధర్నా నిర్వహించగా, భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ అమ్మవారి చూపు గ్రామంలో పడకుండా అడ్డుగోడలు పెడతారా, అంటూ ప్రశ్నించారు.. గ్రామకంఠం ఆలయ ఆవరణ స్థలాన్ని వదలాలని డిమాండ్ చేశారు. దుర్గామాత గుడి ముందు భూకబ్జా కాకుండా సమస్యను పరిష్కరిస్తామని డిఎస్పి నరేందర్ గౌడ్ గ్రామస్తులను సముదాయించారు, గ్రామస్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, భూ రక్షణ కోసం చర్యలు తీసుకుంటానని శాంతియుత, వాతావరణంలో సమస్య పరిష్కారానికి ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామయంపేట సిఐ వెంకట్ రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్,ఎమ్మార్వో మాలతి, తదితరులు ఉన్నారు.