23-09-2025 07:32:14 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్(District Medical Officer Dr. Madhusudhan) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాటారం మండల కేంద్రంలో ఇటీవల ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ల దందా కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు అందడంతో కాటారం మండల కేంద్రంలో ప్రవేటు ఆసుపత్రులైన సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ ఆస్పటల్, అరవింద ప్రథమిక చికిత్స కేంద్రం, లలిత క్లినిక్ లను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ఆస్పత్రి నడిపించ వద్దని హెచ్చరించారు. ఆర్ఎంపీ వైద్యం పేరిట ఆసుపత్రులను కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటు వంటి సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్ కు నోటీసులు జారీ చేశారు.
ఈ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్.ఎం.పి వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడ వద్దని ఆస్పత్రులు అన్ని రకములైన రిజిస్టర్ డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా చేసినట్లు సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. అనుమతి లేకుండా అబార్షన్లు చేయరాదని, ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని క్వాలిఫై డాక్టర్లు మాత్రమే వైద్యం అందించాలని తెలిపారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా వైద్యాధికారినీ డాక్టర్ శ్రీదేవి, కాటారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, పిఓ డాక్టర్ సందీప్, శ్రీదేవి, డి డి ఎం మధు పాల్గొన్నారు.