calender_icon.png 24 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగీరథ నీరు గ్రామానికి రాదా?

24-07-2025 12:00:00 AM

  1. గ్రామాలలో కనిపించని మిషన్ భగీరథ నీళ్లు,
  2. ట్యాంకులకు ఎక్కని నీరు, ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు

చిలుకూరు, జూలై 2౩ ః మండల పరిధిలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు, గ్రామాలలో ఎక్కడ చూసినా జనం క్యాన్లతో వాటర్ ప్లాంట్ దగ్గర మినరల్ నీటిని  కొనుకుంటున్నారు. మిషన్ భగీరథ ట్యాంకులు సరిగా లేకపోవడం, పైపులైన్ల ద్వారా నీరు సరిగా రాకపోవడం,

ట్యాంక్లు లీకేజీ కావడం వంటి సమస్యలతో దర్శనమిస్తున్నాయి, వీధి వీధికి పైపులైన్లు వేసి ఇంటింటికి నల్ల ఫిట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం రావడం లేదు, ఇంకా గ్రామాలలో ప్రజలు గ్రామపంచాయతీ బోరు మోటార్ల  నీలపైనే ఆధారపడి ఉన్నారు. అధికారులు మాత్రం రికార్డులలో  గ్రామాలకు నీరు చేరుతున్నట్లు చూపడం గమనార్హం.

లక్ష్యం చేరని మిషన్ భగీరథ

ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో సుమారు రూ,40 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టి గత బీఆర్‌ఎస్ సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్ నేటికీ లక్ష్యం చేరుకోలేదు, మొదట్లో తరచూ లీకేజీలతో నీరు కలుషితం కావడం, మట్టి, బురద, పురుగులు రావడం, ఎక్కడికి అక్కడ లోకల్ బోరు నీటిని వాడటం వంటి కారణాలతో ప్రజల్లో భగీరథ నీళ్లపై  విశ్వాసం సన్నగిల్లింది.

భగీరథ నీళ్లు కలుషితం కావడానికి కారణం పైపులైన్ లీకేజీ గ్రామాలలో 80 నుంచి 90 శాతం. ఇంట్రా పైపులైను పాతదే వాడుకున్నారు. ఎస్సీ కాలనీలతో పాటు పాత లైన్ పూర్తిగా దెబ్బతిన్న చోట మాత్రమే కొత్తగా ఇంటర్ పైప్ లైన్ వేశారు .

ఈ పనులను కూడా ఎక్కడికక్కడ లోకల్ ఏజెన్సీలు,కాంట్రాక్టర్లకు అప్పగించడంతో అస్తవ్యక్తంగా చేశారు. లో క్వాలిటీ పైప్ లైన్లను తక్కువ లోతులో వేయడంతో ట్రాక్టర్లు వెళ్లినా, డ్రైన్ల   కోసం కేబుల్స్ కోసం ఏ కొంచెం తవ్విన లోపల వాటర్ ప్రెషర్ పెరిగిన పైపులు ఒత్తిడి తట్టుకోలేక పగులుతున్నాయి,

లీకేజీలే  అసలు సమస్య 

24 గంటలు వాటర్ సప్లై చేయాలన్న లక్ష్యంతో 2016లో మిషన్ భగీరథ స్కీమ్  చేపట్టారు. ఇందుకోసం సుమారు 40,000 కోట్లకు పైగా కేటాయించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ ఎక్కడికి అక్కడ పాత ఇన్ ప్రో స్ట్రక్చర్లను అడ్డగోలుగా వాడేశారు. పాత ట్యాంకులన్నిటికీ  కొత్త రంగులు పూసి మిషన్ భగీరథ లో కలిపేశారు. అందువల్ల ట్యాంకీలలో నీరు స్టోరేజీ నిలవకుండా లీకేజీ అయ్యి పోతున్నాయి.

ప్రభుత్వం మారిన రాని భగీరథ నీళ్లు : 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్న ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కానీ భగీరథ సిబ్బంది రోజు ఉదయాన్నే గ్రామాలలో తిరుగుతూ నీటి సరఫరా చేస్తున్నామని చెప్తున్నా భగీరథ నల్లాలకు నీళ్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. 

కానీ అధికారులు మాత్రం  దీనికి భిన్నమైన రిపోర్ట్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని అనేకసార్లు ప్రకటించి ఇవ్వలేకపోయింది, ఈ ప్రభుత్వమైనా నీళ్లకు ఇబ్బంది లేకుండా ఇస్తారని ప్రజలలో చర్చ జరుగుతుంది.

పట్టించుకోని అధికారులు

మిషన్ భగీరథ నీరు ఇంటింటికి చేరుతున్నాయా లేదా అని పట్టించుకున్న అధికారే లేడు. గ్రామాలలో గ్రామసభలు పెట్టినప్పుడు మిషన్ భగీరథ కు సంబంధించిన ఏ అధికారి కూడా హాజరు కావడం లేదు. గ్రామ సభలలో గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీళ్ల గురించి నిలదీస్తే సంబంధిత అధికారులు రాలేదని చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు  స్పందించి వాటర్ ట్యాంకులను పరిశీలించి వాటిని శుభ్రపరిచి నీరెక్కించి గ్రామాలకు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలనీ మండల ప్రజలు కోరుతున్నారు. 

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు 

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి సురక్షిత మంచినీటి సరఫరా చేస్తామని, మంచిగా ఉన్న సిసి రోడ్లన్నీ పగలగొట్టి  పైపులైన్లు  వేశారు. పైపులైన్లు ఇంకా వాటికి కలెక్షన్ ఇవ్వకుండా ఉన్నాయి. భగీరథ నీళ్లు వస్తే  ఈ మినరల్ వాటర్ కొనాల్సిన అవసరం లేదనీ చెబుతుంటే విన్నాం. అయినా ఇంతవరకు మా  కాలనీకి  చుక్క కూడా రాలే. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

 ఏపూరి సైదమ్మ, చిలుకూరు గ్రామ మహిళ