calender_icon.png 15 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి మజిలీకి దారి కష్టాలు

15-09-2025 12:42:51 AM

-దహన సంస్కారాలకు తప్పని ఇబ్బందులు

-వర్షం కురిస్తే బురుద, గుంతలమయం

-కాలినడకకు సైతం తప్పని ఇబ్బందులు

-చిట్యాలలో అధ్వానంగా మారిన స్మశాన దారి

-ప్రజల కష్టాలు పట్టని అధికారులు, పాలకులు

చిట్యాల, సెప్టెంబర్  14 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయాలంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.తెలంగాణ ప్రభుత్వ హయంలో చిన్న చిన్న గ్రామాల్లోనూ వైకుంఠధామాలు నిర్మించింది.కానీ మండలకేంద్రమైన చిట్యాలలో మాత్రం సగం జనాభాకు కేవలం ఒకటే వైకుంఠ ధామన్ని నిర్మించి చేతులు దులుపుకున్నారు.చిట్యాలకు పాత తాలుకగా పేరున్న చనిపోయిన తమ వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

పాత చిట్యాల,బస్టాండ్ ప్రాంత ప్రజలకు చలివాగు దగ్గరలో వైకుంఠధామం ఏర్పాటు చేయాల్సి ఉంది.కానీ అప్పటి పాలకులు,అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఎవరు మృతి చెందిన చలివాగు ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రస్తుతం వర్షాకాలం వల్ల చలివాగుకు వెళ్లవలసిన రోడ్డు పూర్తిగా బురదమయం కావడమే కాకుండా,వాగు నిండుగా ప్రవహిస్తున్నందున అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు పాలకులు స్పందించి వెంటనే రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నూతనంగా నిర్మాణం చేయాలని,స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

దారి సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నాం..

గత కొన్నెండ్లుగా మృతి చెందిన వారిని చలివాగు ప్రాంతంలో ఖననం చేయడం అనవాయితీగా వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మశాన వాటిక దారి సరిగ్గా లేక గ్రామస్తులు ఎవరైనా మరణిస్తే వారిని అంత్యక్రియలకు తీసుకెళ్లి ఖననం చేయడానికి తీవ్ర ఇబ్బందులు  ఎదురుకోవాల్సి వస్తుంది. అంత్యక్రియలకు తీసుకెళ్లే రెండు కిలోమీటర్ల దారి పూర్తిగా అధ్వానంగా ఉండడం వల్ల  కాలినడకన సైతం వెళ్లలేకపోతున్నాం. అధికారులు,పాలకులు స్పందించి స్మశాన వాటికను ఏర్పాటు చేసి స్మశాన వాటిక వద్దకు రోడ్డు నిర్మించాలని కోరుతున్నాను.

 బైరం భద్రయ్య, మాజీ సర్పంచ్ చిట్యాల