calender_icon.png 15 September, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పని యూరియా కిరికిరి

15-09-2025 12:23:46 AM

-కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల గోస 

-తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ క్యూ లైన్‌లో నిలబడిన అందని యూరియా బస్తాలు 

-సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ 

-పోలీసుల బందోబస్తు మధ్య యూరియా టోకెన్ల పంపిణీ 

కామారెడ్డి, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): యూరియా కిరికిరి వీడడం లేదు. యూరియా కావలసిన రైతులు ఎక్కువగా ఉండడంతో సప్లై మాత్రమే తక్కువగా వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామునే యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడితే యూరియా మాత్రం 400 నుంచి 900 బస్తాల వరకు మాత్రమే నరపరచేస్తున్నారు. దీంతో రైతులు క్యూ లైన్ లో నిలుచున్న అందరికీ యూరియా బస్తా మాత్రం అందడం లేదు. దీంతో రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కామారెడ్డి జిల్లాలో నీ ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో యూరియా కొరత ఏర్పడింది. రైతులకు అవసరమైనంత యూరియా ను అధికారులు సరఫరా చేయడం లేదు.

దీంతో రైతులు ప్రతిరోజు యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న క్యూలైన్లో నిలబడిన రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడంతో టోకెన్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఆదివారం రామారెడ్డి మండలం రెడ్డిపేట, అన్నారం గ్రామాల్లో యూరియా కోసం ఉదయం నుంచి రైతులు క్యూ కట్టారు. యూరియా 600 బస్తాలు రావడంతో క్యూ లైన్ లో 900 మంది రైతులు క్యూలో నిల్చున్నారు. దీంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి పేటలో విండో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తండాలకు చెందిన గిరిజనులు తెల్లవారుజామున వచ్చి క్యూ లో నిల్చుండడంతో రెడ్డి పేట గ్రామస్తులకు యూరియా అందలేదు. దీంతో గ్రామానికి చెందిన వారికి యూరియా పంపిణీ చేయకుండా తండావాసులకు పంపిణీ చేయడం ఏమిటి అంటూ రైతులు నిలదీశారు. ముందుగా వచ్చిన రైతులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. యూరియా బస్తాలు అందని రైతులకు టోకెన్లు ఇచ్చి సోమవారం యూరి యా అందజేస్తామని అధికారులు రైతులకు సర్ది చెప్పారు. అన్నారంలో కూడా రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లాలో ప్రతిరోజు యూరియా కోసం ఎక్కడో ఒకచోట రైతులు ఆందోళన చేపడుతున్నారు. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం మొద్దు నిద్ర విడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముందుగా రైతులకు టోకెన్లు పంపిణీ చేసిన తర్వాత యూరియా గ్రామానికి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా అవసరమైన రైతులు ఎక్కువగా ఉంటున్నారు. అధికారులు మాత్రం యూరియాను తక్కువగా సప్లై చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి గ్రామాల వారీగా రైతులకు కావలసిన యూరియా వివరాలను సేకరించి అంతే మొత్తంలో యూరియాను సరఫరా చేయాలనీ రైతులు కోరుతున్నారు.

అధికారులు మాత్రం హడావిడి చేస్తున్నా రే తప్ప రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయ డం లేదని రైతుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పది టన్నుల వరకు యూరియాను సరఫరా చేస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో లోని రైతులకు యూరియా ఇబ్బందులు తొలుగుతాయని రైతులంటున్నారు. అధికారులు మాత్రం ఆర కోరాగా యూరియాను సరఫరా చేస్తున్నారు. దీంతో రైతులు ప్రతిరోజు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో నిల్చుని యూరియా కోసం తంటాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు సరిపడ యూరియా స్టాక్ ను జిల్లా కు తెప్పించాలని రైతు లు కోరుతున్నారు.

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తాం.. 

కామారెడ్డి జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెంద వద్దని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. పైనుంచి యూరియా సరఫరా తక్కువగా రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి యూరియా కొరతపై నివేదిక అందజేశామని తెలిపారు. త్వరలోనే రైతులకు సరిపడా యూరియా స్టాక్ వస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి