03-01-2026 12:19:38 AM
హైదరాబాద్, జనవరి ౨(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు శుక్రవారం అఖిలపక్ష నేతలతో రాష్ట్ర అసెంబ్లీలో భేటీ అయ్యారు.
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కౌసర్ మోయునుద్దీన్ లతో భేటీ అయ్యారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష నాయకులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ప్రధాన డిమాండ్‌తో సీఎం నేతృత్వంలో అఖిలపక్షాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. బీసీ జేఏసీ నేతలు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్ష పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారని అసెంబ్లీలో చర్చించే విధంగా చర్యలు తీసుకొనడమే కాకుండా బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా కృషి చేస్తామని బీసీ జేఏసీ చేస్తున్న.
ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అఖిలపక్ష నేతలు సానుకూలంగా స్పందించారు.ఈ భేటీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ నాయకులు శేఖర్ సగర, యువజన సంఘాల జేఏసీ చైర్మన్ కనకాల శ్యామ్ కురుమ, జేఏసీ అధికార ప్రతినిధి విక్రమ్ గౌడ్, ఇతర ప్రతినిధులు మణిమంజరి, వీరస్వామి, భాస్కర్, తారకేశ్వరి, నరసింహ, లింగం గౌడ్ పాల్గొన్నారు.