04-07-2025 11:40:36 PM
కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ సెక్రెటరీ డాక్టర్ రాజి
భద్రాచలం,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు ప్రాణాంతకమైన వ్యాధులు సికిల్ సేల్ అనీమియా, తల సేమియా, ఇతర వ్యాధులు బారిన పడకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి గిరిజన గ్రామాలలో సకాలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ రాజి అన్నారు. శుక్రవారం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల వారీగా గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా చేపట్ట వలసిన కార్యాచరణ పై రాష్ట్రాలవారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తల సేమియా, సికిల్ సెల్ వ్యాధులు వయసు తేడా లేకుండా అందరికీ వాతావరణాన్ని బట్టి సోకుతుందని, ప్రతి గిరిజన గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించి చిన్నపిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వహించి టెస్టింగ్ కి పంపాలని, తల సేమియా, సికిల్ సెల్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామంలోని అందరికీ రక్త పరీక్షలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని, దోమలు ప్రబలకుండా ఫాగింగ్ చేయాలని, ఇంటింటికి సికిల్ సెల్, తల సేమియా వ్యాధులకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై గిరిజనులకు సంబంధిత వైద్య సిబ్బంది సూచించాలని అన్నారు.
అలాగే గ్రామంలోని చిన్నారులకు, గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గిరిజన గ్రామాలలో ఉన్న పీహెచ్సీలలో సికిల్ సేల్ అనిమీయ మరియు ఇతర టెస్టులకు సంబంధించిన పరికరాలు అవసరం ఉంటే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సోమవారం వరకు తమకు పంపించాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో ఉన్న పీహెచ్సీలలో డాక్టర్ల కొరత ఉందని, అలాగే గైనకాలజిస్టులు, ఫిజియోథెరపీ మిషన్లు, ఏరియా ఆసుపత్రి మరియు సిఎస్సి లలో స్కానర్, ఆటోమేటిక్ ఎక్సరే, డిజిటల్ సిటీ స్కాన్ మిషన్లతో పాటు పి హెచ్ సి లలో కూడా సరియైన డాక్టర్ లేరని వీలైనంత తొందరగా సమకూర్చాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ డిప్యూటీ సెక్రటరీకి తెలిపారు.