10-10-2025 12:00:00 AM
భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ప్రబలమైన న్యాయ, రాజ్యాంగ, ధర్మ ఆధారిత వ్యవస్థగా గౌరవించబడుతుంది. కానీ ఇటీవలి కాలంలో దేశం ఎదుర్కొంటున్న కొన్ని ఘటనలు ఈ ప్రజాస్వామ్య మూలాలను ప్రశ్నిస్తున్నాయి. గత సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సీనియర్ న్యాయవాది రాకేశ్ కిషోర్ చేసిన దాడి భారత ప్రజాస్వామ్య విలువలకు, గాంధీయ వాదానికి, న్యాయవ్యవస్థ గౌరవానికి గట్టి దెబ్బ పడినట్లేనని చాలా మంది అభిప్రాయపడుతు న్నారు. ఈ సంఘటన ఒక వ్యక్తి కోపం మాత్రమే కాదు.
అది సమాజంలో పెరుగుతున్న అసహనం, విభజనాత్మక రాజకీ యాల ప్రభావం, నైతికత, క్షీణతకు ప్రతీక గా మారింది. జస్టిస్ బీఆర్ గవాయ్ భారత సుప్రీంకోర్టుకు అత్యున్నత న్యాయమూర్తి. ఆయన న్యాయ తీర్పుల్లో నిష్పాక్షికత, సత్య నిష్ఠ, ధర్మం కనిపిస్తాయి. కానీ ఇటీవలే ఒక కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలను ‘హిం దూ భావాలను అవమానించేలా చేశారనే’ కారణంతో రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే షూ విసిరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది సుప్రీంకోర్టు చరిత్రలో అత్యం త అవమానకరమైన ఘటనల్లో ఒకటిగా మిగిలిపోనుందనేది అక్షరసత్యం. ఈ దాడి ని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిలా కాకుండా భారత న్యాయవ్యవస్థపైనే జరిగిన దాడిగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పెరుగుతున్న హింస
జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనకు నేర్పిన ప్రధాన సూత్రం ‘అహింసా పరమో ధర్మః’. ఆహింసా మార్గమే సమా జ మార్పుకు సాధనమని ఆయన నిరూపించారు. కానీ నేటి భారతదేశం గాంధీ మార్గాన్ని, ఆయన అనుసరించిన విలువలను పూర్తిగా మరచిపోతున్నట్టుగా కనిపి స్తోంది. మనసులోని అసహనం, రాజకీ య కక్షలు, మతపరమైన ఆవేశాలు సమాజాన్ని చీల్చుతున్నాయి. న్యాయస్థానం వంటి పవిత్రమైన ప్రాంగణంలోనే ఒక న్యాయవాది హింసకు పాల్పడటం అంటే ప్రజాస్వామ్యం పట్ల అసభ్యత, నైతిక బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే. ఇది భారత సంస్కృతిలోని ‘సత్యం వధ.. ధర్మం చర’ అనే వాక్యానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది.
జస్టిస్ గవాయ్ ఈ సంఘటన త ర్వాత చూపిన శాంత స్వభావం గాంధీయవాదానికి సజీవ సాక్ష్యం. తనపై భౌతిక దా డి జరిగినప్పటికీ ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా, కోర్టు పని కొనసాగిం చమని సూచించారు. ఇది ఒక గొప్ప మనస్తత్వం. ‘మీలోని శత్రువును గెలవడానికి ఆయుధం కాదు, ఆత్మబలం కావాలి’ అని గాంధీ పేర్కొన్నారు. తాజాగా తనపై జరిగిన దాడిని ఖండించకుండా గాంధీ మా ర్గాన్ని అనుసరించిన విధానం జస్టిస్ గ వాయ్ ప్రతిస్పందనలో స్పష్టంగా కనిపించింది. కానీ ప్రశ్న ఏమిటంటే మన దేశం ఈ విలువలను ఇంకా కొనసాగించగలదా? లేక అసహనం, కక్ష, విభజనలే కొత్త సాంప్రదాయాలుగా మారుతున్నాయా అనేది ఆలో చించుకోవాలి.
న్యాయవృత్తికే అవమానం
సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడి చేయడం వెనుక వ్యక్తిగత మతాభిమానమే ప్రధాన కారణమని అంతా అంటున్నారు. కానీ ఒక న్యాయవాది తన వృత్తి నైతికతను మరచి హింసకు దిగడం న్యాయప్రవృత్తికే అవమానం. చేసింది తప్పని తెలిసినప్పటికీ .. ‘నాకు పశ్చాత్తాపం లేదు. దేవుడు చెప్పాడు నేను చేశాను’ అని మీడియా సాక్షిగా పేర్కొనడం ఆయన నైతికతను ప్రశ్నిస్తుంది. ఇది సమాజంలో పెరుగుతున్న అంధ భక్తి, అజ్ఞానానికి చిహ్నం. మన న్యాయ వ్యవస్థ భగవంతుని ఆజ్ఞపై ఆధారపడదు.
అది రాజ్యాంగం, న్యాయం, ధర్మం, సత్యం అనే మూల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య దేశం లో జరగడం బాధాకరం. భారతదేశం లాంటి రాజ్యాంగ దేశంలో న్యాయమూర్తు లు ప్రజల రక్షకులు. వారిపై దాడి చేయ డం అంటే ప్రజలనే దెబ్బతీయడం. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే దేశం నాశనం దిశగా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి హింసాత్మక చర్యలకు కఠినమైన చట్టపరమైన శిక్షలు విధించడం అవసరం. ఈ సంఘటన గాంధీయవాదానికి విరుద్ధమని చెప్పడంలో సందేహం లేదు.
గాంధీ రాజ్యాంగం, స్వాతంత్య్ర పోరాటం, ప్రజాస్వామ్య ఆత్మకు పునాది. గాంధీ నడిచిన మార్గం నేడు మళ్లీ అవసరం పడినట్లుగా అనిపిస్తోంది. గాంధీ చెప్పినట్లు ‘అహింస మనిషి యొక్క అస్త్రం.. దానిని బలహీనతగా కాదు బలంగా చూడాలి’. కానీ నేటి సమాజం హింసను హీరోయిజంగా భావిస్తోంది. అదే కారణంగా న్యాయస్థానాల్లో, రాజకీయాల్లో, మీడియాలో హింసాత్మక భాష, ఆచరణ పెరుగుతోంది. ఈ ఘటన మనకు ఒక హెచ్చరిక. మనం గాంధీ మార్గాన్ని మరచి హింస మార్గాన్ని ఎంచుకుంటే ప్రజాస్వామ్యం నిలబడదు. సత్యం, ధర్మం, ఆహింసలే మన బలం. వాటిని పరిరక్షించడమే మన కర్తవ్యం.
ఇవాళ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై లేవనెత్తిన బూటు మన న్యాయ సంస్కృతిలో దుఃఖ క్షీణతను సూచిస్తుంది. ‘సనాతన సంకుచిత ధర్మం’ పేరుతో సాంస్కృతిక దుందుడుకుతనం, రౌడీయిజం తీవ్రమైం ది. ఈ దుశ్చర్యను చేపట్టిన వ్యక్తి న్యాయవాది ముసుగులో ఉన్న హిందుత్వ ఉగ్ర వాదిలా కనిపిస్తున్నారు. ‘సనాతనానికి ఎలాంటి అవమానాన్ని సహించము’ అని ఆయన అరిచారు. ఇక్కడే నిజమైన సమ స్య మొదలవుతుంది. వ్యక్తులు తమ భావజాలాన్ని మానవత్వం కంటే ఎక్కువగా ఉన్నతీకరించినప్పుడు సనాతన ధర్మం.. సంయమనం, కరుణ విలువలను బోధించలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
రాజ్యాంగాన్ని కాపాడాలి
మతం, ధర్మం, కులం, సంస్కృతి.. ఇప్పుడు వాదనల స్థాయి దాటిపోయి మతోన్మాదుల చేతిలో ఆయుధాలగా మారిపోయాయి. సనాతనం నిర్వచనం ప్రకారం శాశ్వతమైనది. దానికి హింస ద్వారా రక్షణ అవసరం లేదు. కానీ ఈ రోజు సంప్రదాయ రక్షకులుగా పిలవబడుతున్న న్యాయవాదులు దాని పునాదిని, విలువైన సహనాన్ని విడిచిపెట్టి ఉగ్రవాద రూపానికి మారిపోతుండడం శోచనీయం.
వారు రక్షిస్తున్నది ధర్మాన్ని ఎంత మాత్రం కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. నిజానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ గౌరవప్రదమైన జనాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘న్యాయవాదులు తమ వాదనలను సమర్పిం చనివ్వండి. ఈ చర్యలు నన్ను ప్రభావితం చేయవు. న్యాయవాదులు శాంతిని కాపాడటం నేర్చుకోవాలి.’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆయన కేసును వినడం కొనసాగించారు.
ఈ ఒక్క వాక్యం సమకాలీన రాజకీయ భాషపై తీర్పుగా నిలుస్తుంది. ప్రస్తుత పాలనా కాలంలో, ఆగ్రహం చట్టం కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. కానీ ఈ న్యాయస్థాన స్పందన మనకు గుర్తు చేస్తుంది. చట్టం ముందు ఎవరైనా సరే ఆగ్రహం, సంయమనంతో నియంత్రణలో ఉండాల్సిన అవసరముంది. మనం ఏ మతానికి చెందిన వారైనా సరే న్యాయం ముందు అందరం సమానమే. నేటి రాజకీయ, సామాజిక వాతావరణంలో గాంధీయవాదం పునరుద్ధరణ అత్యవసరం.
వి ద్యాసంస్థల్లో, మీడియా వేదికల్లో, ప్రజా చర్చల్లో గాంధీ సూత్రాలను తిరిగి చర్చించాలి. హింసను తిరస్కరించడం అంటే బలహీనత కాదు. అది చైతన్యం, సంస్కా రం, మానవత్వానికి ప్రతీక. మొత్తానికి రా కేష్ కిషోర్ చేసిన దాడి మన సమాజానికి ఒక అద్దం చూపింది. గాంధీ మార్గం కేవలం పాతకాలపు ఆలోచన కాదు, నేటి సమస్యలకు పరిష్కారం చూపగల శాశ్వత సిద్ధాంతం. న్యాయం, సమానత్వం, ఆ హింస, ధర్మం ఇవే భారతీయ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు.
మనం ఈ విలువలను నిలబెట్టుకోకపోతే ప్రజాస్వామ్యం రూపం మాత్రమే మిగిలిపోతుంది. న్యాయవ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే ఇలాంటి పోకడలు మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. న్యాయవ్యస్థ స్వతంత్రకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాబట్టి గాంధీయవాదానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అది మన దేశ ఆత్మ. దానిని కాపాడటం మనందరి రా జ్యాంగ ధర్మం.